Warangal, AUG 22: ట్రాన్స్‌జెండర్ (Transgender) వేధింపులు భరించలేక యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట జీపీ పరిధిలోని కోమటిపల్లి తండాలో మంగళవారం జరిగింది. గూడూరు సీఐ ఫణీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ధరావత్ శివరాం(26), వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ కొర్ర ప్రవీణ్ అలియాస్ తపస్వీ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. విభేదాలు రావడంతో కొద్ది రోజులకే విడిపోయారు. కాగా ధరావత్ శివరామ్‌కు (Shivaram) తన తల్లి నీలమ్మ ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఒకమ్మాయితో పెళ్లి చూపులు పెట్టుకున్నారు. మాటాముచ్చట మాట్లాడుకున్నారు. ఇదే విషయం తెలుసుకున్న ట్రాన్స్‌జెండర్ తపస్వీ అమ్మాయి తరఫు వాళ్లకు ఫోన్ చేసి శివరాం నేను గతంలో పెళ్లి చేసుకున్నాం. మళ్లీ అతడికి మీ అమ్మాయితో ఎలా పెళ్లి జరిపిస్తారని ప్రశ్నించింది.
అంతేకాకుండా శివరామ్‌కు సోమవారం రాత్రి తపస్సి ఫోన్‌చేసి ‘నువ్వు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు. నీ సంగతి చూస్తా. మరో పెళ్లి చేసుకుంటే నువ్వైనా బతికుండాలి లేదంటూ నేనైనా బతికుండాలి’ అంటూ బెదిరించింది (Harassment Of Transgender). దీంతో తీవ్ర మనోవేదనకు గురైన శివరాం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన దవాఖానకు తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. తన కొడుకు మృతికి కారణమైన ట్రాన్స్‌జెండర్ తపస్వీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి నీలమ్మ పోలీసులను ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ఫణీందర్ తెలిపారు.