
హైదరాబాద్, జనవరి 06: పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటిక్రితమే హైదరాబాద్ కు వచ్చిన కొత్తగూడెం పోలీసులకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు తన కొడుకు రాఘవను అప్పగించారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కొత్తగూడెం జిల్లాకు తరలించారు. ఇటీవల పాల్వంచలో రామకృష్ణ, తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాధితుడు రామకృష్ణ చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో తాజాగా బయటకొచ్చింది. ఇందులో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కొడుకు వనమా రాఘవేందర్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. సమస్యల పరిష్కరించడానికి తన భార్యను పంపాల్సిందిగా కోరాడని బాధితుడు ఆరోపించడం సంచలనంగా మారింది.
దీంతో ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ రాశారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తనును బాధకు గురిచేసిందని.. చట్టం, న్యాయంపై తనకు నమ్మకం ఉందన్నారు. తన కొడుకు రాఘవేంద్ర దర్యాఫ్తుకు సహకరించేలా చేస్తానని అన్నారు. కేసులో నిజా నిజాలు తేలే వరకు తన కొడుకును పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతానని హామీ ఇచ్చారు.