Khammam, April 05: ఫైనాన్స్ వ్యాపారుల (Finance Recovery Agents) నుంచి తప్పించుకోవాలని ఓ ఉత్తరప్రదేశ్ కార్మికుడు చెరువులోకి దూకి మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం ఖమ్మం (Khammam) నగర పరిధి జయనగర్‌కాలనీకి ఆనుకొని ఉన్న ఖానాపురం చెరువు వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని ఆగ్రా సమీపంలోని అయ్యేలా గ్రామానికి చెందిన వినయ్ (21) బతుకుదెరువు కోసం కొంతకాలం కిందట ఖమ్మం వచ్చాడు. దానవాయిగూడెంలో ఉంటూ మార్బుల్స్ పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన మేస్త్రీ అజయ్ ఠాగూర్‌తో కలిసి ఖమ్మం నగరానికి చెందిన మోహన్‌సాయి ఫైనాన్స్‌లో ద్విచక్రవాహనాలకు ఫైనాన్స్ తీసుకున్నారు. కానీ కొంతకాలంగా ఈఎంఐ (EMI) చెల్లించడం లేదు. వినయ్ వాహనంపై రూ.4వేలు, అజయ్ ఠాగూర్ వాహనంపై రూ.14వేలు బకాయి ఉంది. దీంతో ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు రామచందర్, అజయ్‌కుమార్ వచ్చి నాలుగు రోజుల కిందట వినయ్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అజయ్ బైక్‌పై కూడా ఈఎంఐ పెండింగ్‌లో ఉండటంతో దానిపై కూడా వినయ్‌నే వేధించారు. శుక్రవారం జయనగర్ కాలనీలో పని చేస్తున్న వినయ్ దగ్గరకు వచ్చిన రికవరీ ఏజెంట్లు నిలదీశారు. మేస్త్రీ డబ్బులు ఎప్పుడు కడతాడని అతనితో గొడవకు దిగారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు వినయ్ పరుగు తీశాడు. పారిపోతున్న వినయ్‌ను రికవరీ ఏజెంట్లు బైక్‌పై వెంబడించారు. ఈ క్రమంలో ఖానాపురం చెరువు వైపుగా వచ్చిన వినయ్.. రికవరీ ఏజెంట్ల నుంచి తప్పించుకునేందుకు అందులో దూకాడు.
అప్పటికే చాలాదూరం పరుగెత్తి ఉండటంతో అలసిపోయిన వినయ్ చెరువులో మునిగిపోయాడు. చెరువులోకి దూకిన వినయ్ నీటిలో మునిగి చనిపోయినట్లుగా గుర్తించిన రికవరీ ఏజెంట్లు అక్కడి నుంచి సైలెంట్‌గా జారుకున్నారు. కాగా, స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వినయ్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.