Hyderabad, SEP 10: వైఎస్ షర్మిలపై (YS sharmila) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) నిప్పులు చెరిగారు. అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే.. ఒక్కమాటకు వందమాటలు అంటాం.. ఆత్మవిశ్వాసంతో చీల్చి చెండాడుతామని తేల్చిచెప్పారు. రాజన్న బిడ్డవైతే రేపు మునుగోడులో పోటి చేసి నీ సత్తా ఏంటో చూపించాలని షర్మిలకు నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. గోపాల్‌పేట మండల పరిధిలోని 16 గ్రామపంచాయతీలకు చెందిన 1331 మందికి నూతన ఆసరా ఫించను గుర్తింపు కార్డులను మంత్రి నిరంజన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) మాట్లాడుతూ.. 22 ఏండ్లుగా తెలంగాణ జెండా పట్టుకుని ప్రజల మధ్యన ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడిన ఉద్యమకారున్ని అని తెలిపారు. రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర మీది అని ధ్వజమెత్తారు. వైఎస్ ఆదాయపు పన్ను కట్టకముందే న్యాయవాదిగా ఆదాయపు పన్ను కట్టిన వ్యక్తిని అని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే నా బిడ్డలను విదేశాల్లో చదివించానని తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు తెచ్చి ఎకరా ఎకరాకు నీళ్లు పారించిన వ్యక్తిని అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
మీ రెండు వందలు ఎక్కడ? మా రెండు వేలు ఎక్కడ? అని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించారు. 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇచ్చిన ఘనత తమ సర్కార్‌ది అని తెలిపారు. ఊర్లో ఎవరైనా చస్తే తప్ప ఫించను రాని పాలన నుండి బతికున్న మనుషులకు ఫించన్లు ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు. పాలన రాదన్న స్థితి నుండి దేశ పాలనకు దిక్సూచిలా నిలిచామన్నారు. తెలంగాణ గడ్డ మీద అహంకారంతో యాత్ర చేస్తూ తెలంగాణ వారిని దూషించడం సరికాదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
అయితే అంతకు ముందు వనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైస్ షర్మిల (YS Sharmila)..టిఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి ఫై నిప్పులు చెరిగింది. ఎవర్రా మరదలు.. సిగ్గుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలు చేస్తుంటే.. ఈ నిరంజన్ రెడ్డి తనను గతంలో మంగళవారం మరదలు అన్నారని షర్మిల గుర్తు చేశారు. ఎవర్రా మరదలు.. సిగ్గుండాలి కదా అంటూ ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మెట్టు దెబ్బలు తింటారు జాగ్రత్త అని హెచ్చరించారు. దీనిపై మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు.