Washington, May 07: ప్రపంచ ఐకానిక్ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) అన్ని టెక్ కంపెనీలకు రోల్ మోడల్.. ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కంపెనీకి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ వచ్చిందంటే చాలు.. ఇతర ఫోన్ల కన్నా ఎక్కువ క్రేజ్ ఉంటుంది. మార్కెట్లో ఎప్పుడూ ముందుండే ఆపిల్ తమ కంపెనీలో ఉద్యోగుల తొలగింపు విషయంలో ఆచితూచి వ్యవహారిస్తోంది. ప్రస్తుత మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీ రంగం చాలా కష్టపడుతోంది. మార్కెట్లో మారుతున్న డిమాండ్‌లు, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికే గూగుల్ (Google), అమెజాన్ (Amazon), ట్విట్టర్ (Twitter) వంటి సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. అయితే, ఇప్పటివరకూ మార్కెట్లో భారీ ఉద్యోగుల తొలగింపులకు దూరంగా ఉంది ఒక కంపెనీ మాత్రమే. అదే ఆపిల్.. త్వరలో ఆపిల్ కంపెనీలో తమ ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని కంపెనీ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) క్లారిటీ ఇచ్చారు. అలాంటిదే జరిగితే మాత్రం.. ఆపిల్ కంపెనీలో భారీ తొలగింపులు అనేది చివరి ప్రయత్నంగా ఉంటాయని సీఈఓ కుక్ స్పష్టం చేశారు. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ.. కంపెనీలో భారీ తొలగింపులను ‘చివరి ప్రయత్నం’గా మాత్రమే పరిగణిస్తుందని చెప్పారు.
ఆపిల్ ఇప్పటికే కంపెనీ ఖర్చులను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది. పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత లేకుండా నియామకాల వేగాన్ని మాత్రమే నెమ్మదిస్తోంది. కంపెనీ నియామక పద్ధతులపై ఆపిల్ అత్యంత వివేకంగా వ్యవహరిస్తోందని కుక్ అన్నారు. కంపెనీ ఖర్చును తగ్గించుకోవడానికి అనేకే మార్గాలను ఆపిల్ అన్వేషిస్తోందని వివరించారు. గతంలో కన్నా తక్కువ క్లిప్ స్థాయిలో నియామకాన్ని కొనసాగిస్తున్నామని కుక్ చెప్పారు. ఖర్చు చేయాల్సిన వస్తువుల విషయంలో తొందరపడకుండా అవసరమైన పనులను మాత్రమే పూర్తి చేస్తున్నామన్నారు. ఖర్చులను ఆదా చేయడానికి మరికొన్ని మార్గాలను కనుగొంటామని కుక్ పేర్కొన్నారు.
గత ఏప్రిల్‌లో ఆపిల్ తక్కువ సంఖ్యలో కార్పొరేట్ రిటైల్ డివిజన్ ఉద్యోగులను తొలగించింది. ఎందుకంటే.. కరోనా మహమ్మారి సమయంలో కంపెనీలో దూకుడుగా నియామకాలను జరపకపోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఇతర టెక్ దిగ్గజాల కన్నా ఆపిల్ ఈ విషయంలో మెరుగైన స్థితిలో ఉంది.
మార్కెట్ ఒడిదొడుకులు ఉన్నప్పటికీ.. ఆపిల్ మార్చి త్రైమాసికంలో 94.8 బిలియన్ డాలర్ల రికార్డు ఆదాయాన్ని నమోదు చేసింది. ఆపిల్ ఎక్కువగా ఐఫోన్ల అమ్మకాల ద్వారా 51.3 బిలియన్ డాలర్లను తెచ్చిపెట్టింది. యాప్ స్టోర్ (App Store), యాపిల్ మ్యూజిక్ (App Music), ఐక్లౌడ్ (iCloud) పేమెంట్ సర్వీసెస్‌తో సహా ఆపిల్ సర్వీసెస్ కూడా 20.9 బిలియన్ డాలర్ల కొత్త ఆదాయ రికార్డును నెలకొల్పింది. ఇంతలో, Mac (మ్యాక్) 7.2 బిలియన్ డాలర్లు, iPad ఆదాయం 6.7 బిలియన్ డాలర్లు, వేరబుల్ గాడ్జెట్లు, ఆపిల్ అప్లియన్సెస్ ఆదాయం మొత్తం 8.8 బిలియన్ డాలర్లుగా నమోదు చేసింది.