![](https://test1.latestly.com/uploads/images/2025/02/90-195.jpg?width=380&height=214)
New Delhi, FEB 08: మీరు ఇంట్లో, ఆఫీసుల్లో ల్యాండ్‌లైన్ ఫోన్‌ను (Landline) వినియోగిస్తున్న వారంతా ఈ సమాచారం తెలుసుకోవాల్సిందే. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇందులో ల్యాండ్‌లైన్ నెంబర్ల డయలింగ్ సిస్టమ్‌ను (Dialing System) మార్చనున్నది. కొత్త ప్లాన్ ప్రకారం.. ఫిక్స్‌డ్‌లైన్ నుంచి లోకల్ కాల్ చేసేందుకు పది అంకెల నంబర్‌ను డయల్ చేయాల్సి ఉంటుంది. దాంతో ల్యాండ్‌లైన్ నెంబర్లు సైతం మొబైల్ నెంబర్ల తరహాలో మారబోతున్నాయి. ప్రస్తుతం వినియోగించని ఫోన్ నంబర్లను.. అందుబాటులో ఉన్న వనరులను సరిగ్గా ఉపయోగించుకునేందుకు ఎస్‌టీడీ కోడ్ (STD Code) వ్యవస్థను రద్దు చేయాలని ట్రాయ్ ప్రభుత్వానికి సూచించింది.
కొత్త నంబరింగ్ సిస్టమ్‌ను రాష్ట్రం లేదంటే టెలికాం సర్కిల్ స్థాయిలో అమలు చేస్తారు. దాంతో ఫోన్ నంబర్ల కొరత సమస్యను పరిష్కరించే ఎల్‌ఎస్‌ఏ (లైసెన్స్‌డ్ సర్వీస్ ఏరియా) ఆధారంగా ఫిక్స్‌డ్ లైన్ సర్వీస్ కోసం పది అంకెల నంబరింగ్ ప్లాన్‌ను అమలు చేయాలని సిఫారు చేయగా.. కొత్త మార్పుల ప్రకారం.. ప్రస్తుతం ఫిక్స్‌డ్ లైన్ నుంచి ఫిక్స్‌డ్‌లైన్ అంటే ల్యాండ్‌లైన్ టూ ల్యాండ్‌లైన్‌కు కాల్ చేయడానికి నంబర్‌కు ముందుగా ‘౦’ డయల్ చేయాల్సి ఉంటుంది. సున్నా తర్వాత ఎస్‌డీసీఏ, ఎస్‌టీడీ కోడ్, ఆ తర్వాత ఫోన్ నంబర్‌ను డయల్ చేయాల్సి ఉంటుంది. కొత్త నంబరింగ్ విధానం నేపథ్యంలో.. ప్రస్తుత యూజర్ నంబర్లలో ఎలాంటి మార్పులు ఉండవని ట్రాయ్ పేర్కొంది.
కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు టెలికాం ఆపరేటర్లకు ఆరు నెలల వరకు సమయం ఇవ్వాలని ట్రాయ్ కేంద్రానికి సూచించింది. ఇదిలా ఉండగా.. మొబైల్, ల్యాండ్‌లైన్ కనెక్షన్ 90 రోజుల పాటు ఉపయోగంలో లేకపోతే మాత్రమే డీయాక్టివేట్ చేయనున్నట్లు ట్రాయ్ స్పష్టం చేసింది. డీయాక్టివేట్ చేసినా నంబర్ 365 రోజుల పాటు అందుబాటులో ఉంటుందని.. ఆ తర్వాత శాశ్వతంగా నెంబర్‌ను మూసివేయనున్నట్లు చెప్పింది. ఇక టెలికం కంపెనీలు వీలైనంత త్వరగా కాలర్ నేమ్ డిస్‌ప్లే వ్యవస్థను అమలు చేయాలని ట్రాయ్ సూచించింది. తద్వారా ఫేక్ కాల్స్‌ను గుర్తించి.. వాటికి అడ్డుకట్ట వేయొచ్చని అభిప్రాయపడింది.