Mumbai, OCT 04: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) సొంత 4జీ మొబైల్ ఫోన్‌ను విడుదల (BSNL 4G Phones) చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం కార్బన్ మొబైల్స్‌తో (Karbonn Mobiles) భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇతర టెలికాం సంస్థల కంటే చౌకగా ఉండే కొత్త ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ టారిఫ్ రేట్లను పెంచడంతో మొబైల్ యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో రీఛార్జ్ ప్లాన్‌లు చవగ్గా ఉండటమే ఇందుకు కారణం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మరింత మంది వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ అడుగులు వేస్తోంది. తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. అంతటితో ఆగకుండా టైర్ 2, టైర్ 3 నగరాల్లోని వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి ఈ చవకైన 4జీ ఫోన్‌ను ప్రవేశపెడుతోంది.
దేశంలోని ప్రతి మూలకు సరసమైన 4జీ కనెక్టివిటీని తీసుకురావడానికి బీఎస్‌ఎన్‌ఎల్, కార్బన్ మొబైల్స్ (Karbonn Mobiles) చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాయి. దేశ "4జీ సాథీ పాలసీ" కింద ప్రత్యేక సిమ్ హ్యాండ్‌సెట్ బండ్లింగ్ ఆఫర్‌ను ప్రారంభించనున్నాయి. దేశవ్యాప్తంగా సరసమైన 4జీ కనెక్టివిటీని అందించడమే తమ లక్ష్యమని బీఎస్‌ఎన్‌ఎల్ ఒక పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఫోన్ బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌తో వస్తుంది. వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది.