Mumbai, JAN 15: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) 2G సేవలను ఉపయోగిస్తున్న దాదాపు 150 మిలియన్ల భారతీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే కొత్త మార్గదర్శకాలను (TRAI New Rules) రూపొందించింది. కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ (SMS) వంటి వాటికోసం మాత్రమే మొబైల్ ఉపయోగించేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కీప్యాడ్ మొబైల్స్ లేదా 2జీ మొబైల్స్ వాడేవారికి డేటాతో పనిలేదు. అయినప్పటికీ వారు రీఛార్జ్ చేసుకోవాలంటే డేటాకు కూడా కలిపి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ట్రాయ్ కొత్త మార్గదర్శకాలను రూపొందించడంతో.. టెలికాం కంపెనీలు సరసమైన ప్లాన్స్ ప్రారంభించాల్సి ఉంది.
కొత్త నిబంధనల ప్రకారం Airtel, Jio, BSNL, Vodafone Idea (Vi) 10 రూపాయల ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉండే టాప్ అప్ వోచర్‌లను పరిచయం చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. ట్రాయ్ రూ. 10 డినామినేషన్‌కు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని తొలగించింది. దీంతో ఏదైనా విలువ కలిగిన టాప్ అప్ వోచర్‌లను జారీ చేయడానికి ఆపరేటర్‌లను అనుమతిస్తుంది.
ఆన్‌లైన్ రీఛార్జ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యతకు దృష్టిలో ఉంచుకుని.. కలర్ కోడెడ్ ఫిజికల్ రీఛార్జ్ సిస్టమ్‌ను తొలగించాలని రెగ్యులేటర్ నిర్ణయించింది. ప్రత్యేక టారిఫ్ వోచర్‌ల చెల్లుబాటును కూడా 90 రోజుల నుంచి 365 రోజులకు పెంచింది. ఇంటర్నెట్ సేవలు అవసరం లేని 2G ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాయిస్.. ఎస్ఎంఎస్ ప్లాన్‌లను రూపొందించాలని టెలికాం ఆపరేటర్‌లకు సూచించింది.
ట్రాయ్ మార్గదర్శకాలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. కానీ కంప్లైంట్ రీఛార్జ్ ప్లాన్‌లను రూపొందించడానికి టెలికాం కంపెనీలకు కొన్ని వారాల సమయం ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక లాంచ్ తేదీని ప్రకటించనప్పటికీ, జనవరి చివరి నాటికి సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లు మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.