New Delhi, NOV 16: చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐపై టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ (Elon Musk) న్యాయపోరాటం తీవ్రతరం చేశారు. ఈ న్యాయ పోరాటంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తోపాటు వెంచర్ క్యాపిటలిస్ట్, లింక్డ్ఇన్ కో ఫౌండర్ రైడ్ హాఫ్ మన్ లను ప్రతివాదులుగా చేర్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్లో గుత్తాధిపత్యం కోసం మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ (Open AI) ప్రయత్నిస్తున్నాయని పేర్కొంటూ ఈ నెల 14న నార్త్రర్న్ కరోలినా ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓపెన్ ఏఐ మాజీ బోర్డ్ మెంబర్ – ప్రస్తుతం న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివాన్ జిలిస్ తో కలిసి ఎలన్ మస్క్ పిటిషన్ వేశారు. శివాన్ జిలిస్ సైతం తాను ఓపెన్ ఏఐ బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు సంస్థ యాజమాన్యం మార్గ నిర్దేశంపై ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత నాన్ ప్రాఫిట్ మిషన్ లక్ష్యంతో ఓపెన్ ఏఐ ప్రారంభమైంది. కానీ మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఓపెన్ ఏఐ ప్రారంభ లక్ష్యాల నుంచి తప్పుకుని వాణిజ్య ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నదని ఎలన్ మస్క్ ఆరోపించారు.
ప్రత్యర్థి ఏఐ సంస్థలకు నిధులు లభించకుండా, సున్నితమైన సమాచారం షేర్ చేయకుండా నిరోధించడంతోపాటు ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నాయని మస్క్ అభియోగం. లింక్డ్ఇన్ కో ఫౌండర్ రైడ్ హాఫ్ మన్, మైక్రోసాఫ్ట్ యాజమాన్యం కలిసి రెండు కంపెనీల్లో ద్వంద్వ భాగస్వామ్యాన్ని నిరోధించాలని ఎలన్ మస్క్ తన పిటిషన్ లో కోరారు. గత మార్చిలో శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ కోర్టులో ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన ఎలన్ మస్క్.. ఎటువంటి వివరణ ఇవ్వకుండానే ఉపసంహరించుకున్నారు. తాజాగా ఫెడరల్ చట్టాలను ఓపెన్ ఏఐ ఉల్లంఘిస్తున్నదంటూ, తనను డీఫ్రాడ్ చేయడానికి కుట్ర చేస్తున్నదంటూ ఫెడరల్ కోర్టులో కొత్తగా దావా వేశారు. దీనిపై ఓపెన్ ఏఐ గానీ, హాఫ్ మన్ గానీ స్పందించలేదు. మైక్రోసాఫ్ట్ స్పందించేందుకు నిరాకరించింది.