Mumbai, DEC 04: యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే యూజర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని రూ.5వేలకు పెంచడంతో పాటు ప్రతి రూ.1000 వరకు గరిష్ఠంగా చెల్లింపు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. యూపీఐ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను మరింత ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. యూపీఐ లైట్ ద్వారా.. మొబైల్‌లో ఇంటర్‌నెట్ అందుబాటులో లేకపోయినా చెల్లింపులు చేసుకునేందుకు వీలుంటుంది. అంటే ఆఫ్‌లైన్‌లోనూ చెల్లింపులు చేయొచ్చన్నమాట. ఈ మేరకు 2022 జనవరిలో జారీ చేసిన ఆఫ్‌లైన్ ఫ్రేమ్‌వర్క్ నిబంధనలను ఆర్‌బీఐ బుధవారం సవరించింది.
అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (AFA) అవసరం లేనంత వరకు ఆఫ్‌లైన్ విధానంలో చెల్లింపులు జరుగుతాయి. పరిమితి తర్వాత తిరిగి వ్యాలెట్‌లో నగదు జమ చేసుకునేందుకు ఏఎఫ్ఏ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. యూపీఐ లైట్ అనేది యూపీఐ పిన్ అవసరం లేకుండా తక్కువ మొత్తంలో జరిపే లావాదేవీలకు అనుమతించే వ్యాలెట్. ఫోన్‌పే, గూగుల్‌పే, యూపీఐ పే కారణంగా డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రస్తుతం చెల్లింపులను మరింత విస్తరించేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటున్నది.