Google Play Store (Photo Credits: IANS)

గూగుల్ ప్లే స్టోర్ మరోసారి తన లిస్ట్‌ను క్లీన్ చేసింది. ప్రమాదకరమైన పలు యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. హానికరమైన 150 యాప్స్‌ను గుర్తించిన ప్లేస్టోర్ వాటిని వెంటనే నిషేదించింది. దాదాపు 10 మిలియన్ల మంది యూజర్లు ఈ యాప్స్‌ బారిన పడ్డట్లు తెలుస్తోంది.

అల్టీమాఎస్‌ఎమ్‌ఎస్‌ అనే పేరుతో ప్రచారంలో ఉన్న ఈ హానికరమైన యాప్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నది నటీనటులే కావడం విశేషం. ఈ అప్లికేషన్లు ప్లే స్టోర్‌​ నుంచి సుమారు 10.5 మిలియన్ కంటే ఎక్కువ మంది డౌన్‌లోడ్‌ చేశారని గూగుల్‌ తెలిపింది.

సైబర్‌నేరస్తులు కొత్త పుంతలు తొక్కుతూ పలు హానికరమైన యాప్స్‌ను తయారుచేసి వాటిని గూగుల్‌ ప్లే స్టోర్‌లో వచ్చేలా చేశారు. వీటి ద్వారా తక్కువ ధరలోనే పలు ప్రీమియం ఎస్‌ఎమ్‌ఎస్‌ సేవలను అందిస్తామని యాప్స్‌ ప్రచారం చేసుకుంటున్నాయి. ఈజిప్ట్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ, ఒమన్, ఖతార్, కువైట్, యునైటెడ్ స్టేట్స్, పోలాండ్‌లోని ఆండ్రాయిడ్ వినియోగదారులు ఎక్కువగా ప్రభావితమైనట్లుగా తెలుస్తోంది. ప్రీమియం సేవలను అందించడంతో పాటుగా యూజర్లు డబ్బులు సంపాదించే అవకాశం వస్తోందంటూ యూజర్లకు ఆఫర్లను అందిస్తాయి.

అల్టీమాఎస్‌ఎమ్‌ఎస్‌ యాప్స్‌తో యూజర్ల డేటాను హ్యకర్లు చోరీ చేస్తారు. ప్రముఖ యాంటీ వైరస్‌ బ్లాగ్‌ అవాస్థ్‌ ప్రకారం...ప్లే స్టోర్‌ నుంచి యూజర్లు యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసినప్పుడు..వారి లోకేషన్‌ను, ఫోన్‌ ఐఎమ్‌ఈఐ నంబర్, ఫోన్ నంబర్‌ను సేకరిస్తుంది.వారి మెయిల్‌ అడ్రస్‌ను కూడా హ్యకర్లు తమ చేతికి చేజిక్కించుకుంటున‍్నట్లు అవాస్థ్‌ తెలిపింది.

ఇలాంటి హానికరమైన యాప్స్ నుంచి తప్పించుకోవాలంటే ప్రీమియం ఎస్‌ఎంఎస్‌ను డిసేబుల్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యాప్‌ ఇన్‌స్టాల్ చేసుకునే ముందు వాటి రివ్యూలు చదవాలని, కేవలం రేటింగ్ చూసి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.