New Delhi, OCT 21: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు (Google) భారత్ లో గట్టి షాక్ తగిలింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) భారీ జరిమానా (fine) విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్ (Eco System) లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని సీసీఐ పేర్కొంది. దీంతో రూ.1337.76 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అనైతిక వ్యాపార పద్దతులను మానుకోవాలని, తన ప్రవర్తనను మార్చుకోవాలని గూగుల్ కు సీసీఐ హితవు పలికింది. స్మార్ట్ ఫోన్ పని చేయాలంటే దానికి ఓఎస్ (Operating system) కావాలి. అలాంటి ఓస్ లలో ఆండ్రాయిడ్ (Android) ఒకటి. దాన్ని గూగుల్ 2005లో కొనుగోలు చేసింది. మొబైల్ కంపెనీలు దాదాపు ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ ను వాడుతున్నాయి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు ప్లేస్టోర్, గూగుల్ సెర్చ్, గూగుల్ క్రోమ్, య్యూటూబ్ (you tube) తదితర అప్లికేషన్లను గూగుల్ కలిగి ఉందని సీసీఐ పేర్కొంది.
ఇక వీటి ద్వారా పోటీ వ్యతిరేక పద్దతులను గూగుల్ అవలంభిస్తోందని పేర్కొంటూ గూగుల్ కు జరిమానా విధించింది. గూగుల్ అందించే ఫ్రీ ఇన్ స్టాల్ యాప్స్ ను డిలీట్ చేయకుండా నిరోధించడం వంటివి చేయకూడదు అంటూ పలు సూచనలు చేసింది. ఆండ్రాయిడ్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, టాబ్లెట్లలో Original Equipment Manufacturers (OEMs) ఇన్ స్టాల్ చేస్తారు. ఆండ్రాయిడ్ ఓఎస్ పై మొబైల్ ఫోన్ తయారీ దారులు Mobile Application Distribution Agreement (MADA) కింద మొబైల్ ఫొన్లలో Google Mobile Suite (GMS) ను కచ్చితంగా ముందే ఇన్ స్టాల్ చేయాలన్న గూగుల్ ఒత్తిడిని CCI తప్పుబట్టింది. దానికి అన్ ఇన్ స్టాల్ చేసే అవకాశం లేకుండా చేయడం కూడా పోటీ తత్వ వ్యతిరేక చర్యేనని స్పష్టం చేసింది.
జరిమానాతో పాటు పలు హెచ్చరికలను కూడా గూగుల్ కు CCI జారీ చేసింది. నిర్దేశిత సమయంలోగా ఈ అక్రమ, అనైతిక తీరును మార్చుకోవాలని హెచ్చరించింది. ఈ అనైతిక, అక్రమ వ్యాపార శైలికి దూరంగా ఉండకపోతే, మరిన్ని చర్యలుంటాయని స్పష్టం చేసింది.