Artificial Intelligence, representational image (Photo Credits : Pixabay)

Mumbai, JAN 26: ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా గ్రూప్ (OLA Group) అనుబంధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ `కృత్రిమ్ ఏఐ` (Krutrim) నిధుల సేకరణలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. వెంచర్ క్యాపిటల్ ఫండ్ `మ్యాట్రిక్స్ పార్టనర్స్ ఇండియా`తోపాటు ఇత‌ర ఇన్వెస్టర్ల నుంచి 50 మిలియన్ డాలర్ల నిధులు సేకరించింది. 100 కోట్ల డాలర్ల క్లబ్ లో చేరిన తొలి ఇండియా ఏఐ స్టార్ట‌ప్‌గా నిలిచినట్లు `కృత్రిమ్ ఏఐ` (AI) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఓలా కృత్రిమ్ ఫౌండర్ భవిష్ అగర్వాల్ స్పందిస్తూ.. సొంతంగా ఏఐ తయారు చేయడం భారత దేశానికి అవసరం. అత్యంత వేగవంతమైన కృత్రిమ్ ఏఐ తొలి విడుత రౌండ్ నిధుల సేకరణ ప్రక్రియ విజయవంతంగా ముగిసినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ సామర్థ్యంపై ఇన్వెస్టర్లకు గల విశ్వాసానికి ఇది నిదర్శనం అని పేర్కొంటూ ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ పోస్ట్ చేశారు. తమ సంస్థ సేకరించిన నిధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరణలో కీలకంగా మారతాయని చెప్పారు.

 

మ్యాట్రిక్స్ పార్టనర్స్ ఇండియా ఫౌండర్ కం ఎండీ అవ్నీష్ బజాజ్ మాట్లాడుతూ ‘భారత్‌లో ఓలా, ఓలా ఎలక్ట్రిక్ అత్యాధునిక టెక్నాలజికల్ ఆవిష్కరణలు అందుబాటులోకి తెచ్చింది. భవిష్ అగర్వాల్, ఆయన సారధ్యంలోని కృత్రిమ్‌తో పార్టనర్ షిప్ మాకు చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్‌లో కృత్రిమ్ తన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆవిష్కరించింది. బెంగళూరు, శాన్ ఫ్రాన్సిస్కోలో గల నిపుణులైన శాస్త్రవేత్తల టీంతో శిక్షణ తీసుకున్నది. కృత్రిమ్ అంటే సంస్కృతంలో `ఆర్టిఫిషియ‌ల్‌` అని అర్థం. కృత్రిమ్‌.. డేటా సెంట‌ర్ల‌ను అభివృద్ధి చేయ‌డంతోపాటు ఏఐ ఏకో సిస్ట‌మ్ కోసం స‌ర్వ‌ర్లు, సూప‌ర్ కంప్యూట‌ర్లను సృష్టించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తుంది.