24/7 NEFT: ఇకపై వారంలో ఏ రోజైనా, ఏ సమయంలోనైనా మరియు ఎంత మొత్తంలోనైనా డబ్బు పంపించవచ్చు. త్వరలో 24/7 నెఫ్ట్ సౌకర్యం ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ.
RBI to introduce 24/7 NEFT soon | Photo Credits: PTI

ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహిస్తూ ఇకపై 24 గంటలు నగదు లావాదేవీలను నిర్వహించుకునే వీలుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ కసరత్తు ప్రారంభించింది.  2019 డిసెంబర్ నుంచి నెఫ్ట్ (NEFT - National Electronic Funds Transfer) ద్వారా వారంలో ఏ రోజైనా, ఏ సమయంలోనైనా (24/7) నగదు పంపిణీలు చేపట్టవచ్చునని ఆర్బీఐ తెలిపింది.

ప్రస్తుతం వారంలో బ్యాంక్ పనిచేసే దినాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే నెఫ్ట్ లావాదేవీలు జరిపే వీలుంది. బ్యాంక్ సెలవు దినాలు, రెండవ శనివారం, నాల్గవ శనివారం, ఆదివారాల్లో బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకునే వీలు లేదు.

బ్యాంక్ పనివేళలు ముగిసిన తర్వాత అకస్మాత్తుగా డబ్బు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంటే మళ్ళీ బ్యాంక్ తిరిగి ప్రారంభమయ్యే రోజు వరకు వేచి చూడాల్సిందే. ఇప్పుడు ఆ పరిస్థితిని అధిగమించేందుకు, అలాగే డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఈ ముందడుగు వేసింది. 24/7 NEFT అందుబాటులోకి వస్తే నిరంతరం లావాదేవీలు జరిపే అవసరమున్న రీటైల్ రంగం వారికి ఇది ఎంతో ఊరటనిస్తుంది. ఈ ఏడాది జూన్ లోనే NEFT మరియు RTGS ద్వారా జరపే లావాదేవీలపై ఛార్జీలను కూడా  ఆర్బీఐ ఎత్తివేసింది.   ఏ బ్యాంక్ కూడా ఎలాంటి ఛార్జీలు విధించరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

ప్రస్తుతం మొబైల్‌లో ఉండే పలు రకాల డిజిటల్ యాప్స్ ద్వారా ఎప్పుడంటే అప్పుడు డబ్బు పంపించుకునే వీలుంది కానీ, పెద్ద మొత్తంలో ట్రాన్సక్షన్స్ చేయాలంటే నెఫ్ట్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. నెఫ్ట్ ద్వారా ఎంత డబ్బైనా పంపించుకోవచ్చు. దీనికి కనీసం - గరిష్టం అనే పరిమితులేం లేవు.