Reliance Industries 42nd Annual General Meeting (Photo Credits: YouTube)

మూడేళ్ల క్రితం సెప్టెంబర్ 5న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ 'జియో' పేరుతో కొట్టిన దెబ్బకు ఇండియాలోని టెకికాం కంపెనీలన్నీ కకావికలం అయ్యాయి. ఎప్పుడు రీఛార్జిలతో మోతమోగిపోయే వినియోగదారులకు జియో ఎంట్రీతో ఇంటర్నెట్, ఫోన్ కాల్స్ అన్నీ ఫ్రీ అయిపోయాయి. ప్రస్తుతం జియోలో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే చాలు, ఒక పరిమిత కాలం వరకు అపరిమితంగా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు, సరిపడినంత ఇంటర్నెట్ వాడుకోవచ్చు.

తాజాగా ముఖేశ్ అంబానీ జియో ఫైబర్ సేవలను ప్రకటించి మరో సంచలనానికి తెరతీశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంంలో పాల్గొన్న ముఖేశ్ అంబానీ, ఈ ఏడాది సెప్టెంబర్ 05 నుంచి జియో ఫైబర్ (FTTH - Fiber To The Home) సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

ఈ జియో గిగా ఫైబర్ సేవలు అందుబాటులోకి వస్తే, వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగబోతున్నాయంటే..

నెలకు కేవలం రూ. 700 లతో ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి కూడా అపరిమితంగా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు, హైస్పీడ్ (100 ఎంబీపీఎస్ నుంచి 1జీబీపీఎస్ వరకు) బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు హైడెఫినేషన్ గల టీవీ మరియు కేబుల్ సర్వీసులు వినియోగదారులకు లభించనున్నాయి.

రూ. 700 నుంచి మొదలుకొని రూ. 10 వేల వరకు వివిధ సబ్స్‌క్రిప్షన్ ప్లాన్లను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఇప్పటికే డీటీహెచ్ సర్వీసులను అందిస్తున్న సంస్థలు రానున్న కాలంలో జీయో ఫైబర్‌తో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రూ. 500 లతో యూఎస్, కెనడా లాంటి దేశాలకు కూడా ల్యాండ్‌లైన్ నుంచి అపరిమితంగా ఫోన్ కాల్స్ చేసుకునే వీలు కల్పిస్తున్నారు.

'జియో ఫరెవర్' ప్లాన్‌తో జియో 4కే ఎల్ఈడీ టెలివిజన్‌తో పాటు, 4కే సెట్-అప్ బాక్స్‌ను ఉచితంగా పొందవచ్చు. జియో సెటప్ బాక్స్ ద్వారా ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్న వారితో అయినా సరే జీయో టీవీ గుండా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుకోవచ్చు.

ఫస్ట్ డే ఫస్ట్ షో:

చరిత్రలో మొట్టమొదటి సారిగా, ఒక కొత్త సినిమాను రిలీజైన రోజునే నేరుగా ఇంట్లో నుంచే చూసే కాన్సెప్ట్‌ను ప్రవేశపెడుతున్నారు.  2020లో 'జియో ప్రీమియం ఫైబర్' కస్టమర్ల కోసం ఈ కొత్త ప్లాన్ తీసుకురాబోతున్నారు.

అప్పట్లో 'విశ్వరూపం2' సినిమాను నేరుగా డీటీహెచ్‌లో రిలీజ్ చేస్తానని కమల్ హాసన్ ప్రకటించిన విషయం మీకు తెలిసే ఉంటుంది.  డిస్ట్రిబ్యూటర్స్ ఆందోళన చేయడంతో అప్పుడు కమల్ వెనక్కి తగ్గారు. అప్పుడు కమల్ చేస్తానని చెప్పింది, ఇప్పుడు అంబానీ చేయబోయేది రెండు ఒకటే.

ఇప్పుడు సినిమా విడుదల, ప్రదర్శన అంతా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుంది కాబట్టి, రిలీజైన రోజునే జియో డీటీహెచ్ ద్వారా నేరుగా టీవీలోనే సినిమాను ప్రదర్శిస్తారు. దీని ప్రకారం 'ఫస్ట్ డే ఫస్ట్ షో' ప్లాన్ ద్వారా 'జియో ప్రీమియం కస్టమర్లు' కొత్త సినిమాను తమ ఇంట్లో, తమ టీవీల్లోనే చూసేయచ్చు.