
Mumbai, AUG 08: క్విక్ కామర్స్ (Quick Commerce) రంగంలో బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto) సంస్థలతో పోటీ పడేందుకు ఓలా సిద్ధమవుతున్నది. మరో దఫా క్విక్ కామర్స్ (Quick Commerce) రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నదని ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది. క్విక్ డెలివరీ సర్వీసులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుండటంతో ఓలా మాతృసంస్థ ఎఎన్ఐ టెక్నాలజీస్ (ANI Technologies) సొంతంగా డార్క్ స్టోర్స్ ఏర్పాటు చేయనున్నది. ఎక్కడికక్కడ శరవేగంగా కస్టమర్లకు డెలివరీ చేసేందుకు ఏర్పాటు చేసే చిన్న గోదాములను డార్క్ స్టోర్స్ (Dark Stores) అని అంటారు. ఉద్యోగుల భాగస్వామ్యం తగ్గించడానికి డార్క్ స్టోర్స్ ను ఓలా, రోబోట్స్ నిర్వహిస్తాయని సమాచారం. కొంత మంది ఉద్యోగుల భాగస్వామ్యం ఉన్నా డార్క్ స్టోర్స్ సర్వీసు నిర్వహణలో గణనీయ పాత్ర ఆటోమేషన్’దే ఉంటుందని ఆ వార్తాకథనం సారాంశం. డార్క్ స్టోర్స్ తోపాటు ఓలా.. తనకు సొంతంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) సేవలను ప్రారంభించనున్నది.
నూతన ఇన్షియేటివ్ లను ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రకటిస్తారని సమాచారం. ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో అనుబంధ క్విక్ కామర్స్ కంపెనీ బ్లింకిట్ 2026 నాటికి దేశవ్యాప్తంగా 2,000 డార్క్ స్టోర్స్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. అదే జెప్టో వచ్చే ఏడాది మార్చి నాటికి 700 డార్క్ స్టోర్లను ఏర్పాటు చేసే లక్ష్యంతో పని చేస్తోంది.