ISRO chief K Sivan (Photo Credits: ANI)

Bengaluru , January 1: చంద్రయాన్ -3 (Chandrayaan 3) ను ప్రభుత్వం ఆమోదించినట్లు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చైర్మన్ కే. శివన్  (K.Sivan) బుధవారం ధృవీకరించారు అలాగే భారతదేశపు మొట్టమొదటి చంద్ర అన్వేషణ మిషన్ (చంద్రయాన్-3) ప్రక్రియ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. రెండవ అంతరిక్ష నౌకాశ్రయం కోసం భూసేకరణ కూడా ప్రారంభించబడిందని, తమిళనాడులోని తూత్తుకుడి ఓడరేవు ప్రాంతంలో ఉండబోతున్నట్లు ఈరోజు బెంగళూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివన్ తెలియజేశారు.

ఇక చంద్రయాన్ -2 గురించి మాట్లాడుతూ, చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండ్ కాలేకపోయినా, దాని ఆర్బిటర్ చక్కగా పనిచేస్తుందని చెప్పారు. చంద్రుడికి సంబంధించిన సైన్స్ డేటాను మరో 7 సంవత్సరాల పాటు ఉత్పత్తి చేస్తుందని చెప్పారు.

Here's the update:

అంతేకాకుండా ఇదే ఏడాది మరో ప్రతిష్ఠాత్మకమైన గగన్‌యాన్ (Gaganyaan)  ప్రాజెక్టును కూడా చేపట్టబోతున్నామని, 2020లో చిన్నవి పెద్దవి కలిపి మొత్తం 25 పైగా మిషన్లను చేపట్టబోతున్నట్లు  శివన్ తెలియజేశారు. ఇందుకోసం ఇప్పటికే వ్యోమగాముల ఎంపిక పూర్తయిందని, భారత వాయుసేనకు చెందిన నలుగురిని ఎంపిక చేసినట్లు తెలిపారు. వారంతా జనవరి మూడో వారం నుంచి రష్యాలో శిక్షణ తీసుకోబోతున్నట్లు వెల్లడించారు.

చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఈ 2020లోనే చేపట్టబోతున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇదివరకే తెలియజేశారు. ఈ మిషన్ కు అయ్యే ఖర్చు చంద్రయాన్ -2 కంటే తక్కువగా ఉంటుందని మంత్రి తెలిపారు.

వచ్చే ఏడాది చివరి నాటికి, బహుశా నవంబర్ లో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతాయని ఇస్రో వర్గాల నుంచి వెల్లడవుతున్న సమాచారం.