Rare Lake In World (PIC @ NASA X)

New York, FEB 18: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA) ఇటీవలే అమెరికాలోని డెత్ వ్యాలీలో ఏర్పడిన తాత్కాలిక సరస్సుకు సంబంధించి శాటిలైట్ ఫొటోలను విడుదల చేసింది. ఈ ఫొటోలను పరిశీలిస్తే.. ఆ సరస్సు ఏర్పడటానికి ముందు ఆ తర్వాత పరిస్థితిగా నాసా (NASA) పేర్కొంది. నాసా ఎర్త్ అబ్జర్వేటరీ ప్రకారం.. హిల్లరీ హరికేన్ తర్వాత 2023 ఆగస్టులో ఈ తాత్కాలిక సరస్సు ఏర్పడింది. అది క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. అయినప్పటికీ, ఈ ఫిబ్రవరి 2024లో శక్తివంతమైన సరస్సుగా మారింది. నాసా తీసిన శాటిలైట్ ఫొటోల ప్రకారం.. హరికేన్‌కు ముందు ఆ తరువాత ఇటీవలి తుఫాను కారణంగా డెత్ వ్యాలీలో (Death Vally) తాత్కాలిక సరస్సు నిండుగా కనిపిస్తోంది. డెత్ వ్యాలీలోని ఈ తాత్కాలిక సరస్సు మరింతకాలం కొనసాగేలా కనిపిస్తోంది. ఈ నెలలో తుఫాన్ కారణంగా వరద ఉధృతిపెరిగి సరస్సు పూర్తిగా నిండిపోయింది. చూసేందుకు నీలం రంగు నీటితో సరస్సు కొన్ని కిలోమీటర్ల పొడవునా కనిపిస్తోంది.

 

డెత్ వ్యాలీ భూమిపై అత్యంత వేడిగా ఉండే ప్రదేశాలలో ఒకటి. ఉత్తర అమెరికాలో అత్యంత పొడి ప్రదేశంగా పిలుస్తారు. సాధారణంగా ఈ వ్యాలీలో సంవత్సరానికి 2 అంగుళాలు (51 మిల్లీమీటర్లు) వర్షం పడుతుంది. అయితే, గత ఆరు నెలల్లో రెండింతలు వర్షపాతం నమోదైంది. హిల్లరీ హరికేన్ చాలా వరకు కారణమని చెప్పవచ్చు. ఇక్కడి వాతావరణం వేడెక్కడంతో తరచుగా తీవ్రమైన వర్షపాతానికి కారణమవుతోంది.

ఈ కొత్త సరస్సు ఆగస్ట్ 2023లో మాదిరిగా అదే పరిమాణంలో ఫిబ్రవరి 2024లో కూడా పెరిగినట్లు శాటిలైట్ ఫొటోల్లో కనిపిస్తోంది. తద్వారా మరికొన్ని నెలలు ఇలానే కొనసాగుతోందని నాసా తెలిపింది. నేషనల్ పార్క్ అధికారుల ప్రకారం.. ఫిబ్రవరి 14 నాటికి సరస్సు ఒక అడుగు లోతులో ఉంది. ఇది ఎంతకాలం ఉంటుందో స్పష్టత లేదు. గత అక్టోబరు నాటికే ఈ సరస్సు పూర్తిగా అదృశ్యమైపోతుందని భావించారు. దాదాపు ఆరు నెలల తర్వాత ఇప్పటికీ ఈ సరస్సు మరింత విస్తరిస్తూనే ఉందని డెత్ వ్యాలీ నేషనల్ పార్క్‌లోని రేంజర్ అబ్బి వైన్ పేర్కొన్నారు.