William G Kaelin Jr, Sir Peter J Ratcliffe and Gregg L Semenza (Photo Credits: Academy)

Sweden, October 07: వైద్యశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతుల ప్రకటన వెలువడింది. 2019 ఏడాదికి గానూ మెడిసిన్ విభాగంలో విలియం జి. కైలిన్ జూనియర్ (William G. Kaelin Jr), సర్ పీటర్ జె. రాట్క్లిఫ్ (Sir Peter J. Ratcliffe) మరియు గ్రెగ్ ఎల్. సెమెన్జా (Gregg L. Semenza) ముగ్గురిని కలిపి సంయుక్తంగా నోబెల్ బహుమతి విజేతలుగా ప్రకటించారు.  శరీరంలోని కణాలపై వీరు జరిపిన జరిపిన హైపోక్సియా (Hypoxia) పరిశోధనలకు గుర్తింపుగా నోబుల్ అవార్డ్ వరించింది. "జీవకణాల ప్రతిస్పందన మరియు అందుబాటులో ఉన్న ఆక్సిజన్ లభ్యతను స్వీకరించే తత్వం" పై వీరు చేసిన పరిశోధనలు కేన్సర్, అనీమియా లాంటి వ్యాధులపై మెరుగైన చికిత్స చేయటానికి ఎంతగానో ఉపయోగపడతాయని నోబుల్ అవార్డ్స్ కమిటీ అభిప్రాయపడింది.

శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు కణసంబంధిత జీవక్రియ మరియు శారీరక పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపైన వీరి పరిశోధనలు సరైన అవగాహన కల్పించాయని కమిటీ సభ్యులు వివరించారు. వీరి పరిశోధనలు కణ సంబంధింత వ్యాధులపై పోరాడటానికి కొత్త వ్యూహాలతో కొత్త ఆవిష్కరణలు చేసే దిశగా మార్గం సుగమం చేశాయని వెల్లడించారు.

ఈ ముగ్గురు విజేతలు ఏం చదివారు, వీరి నేపథ్యం ఏంటో ఇక్కడ చూడండి

విలియం జి. కైలిన్, జూనియర్ 1957 లో న్యూయార్క్‌లో జన్మించారు. డర్హామ్లోని డ్యూక్ విశ్వవిద్యాలయం నుండి M.D.గా పట్టాపొందారు. బాల్టిమోర్‌లోని జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం మరియు బోస్టన్‌లోని డానా-ఫార్బర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో మెడిసిన్ చేశారు మరియు ఆంకాలజీలో ప్రత్యేక శిక్షణ పొందారు. డానా-ఫార్బర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో తన సొంత పరిశోధనా ప్రయోగశాలను స్థాపించారు. 1998 నుండి హోవార్డ్ హ్యూస్ మెడికల్ ఇన్స్టిట్యూట్ యొక్క పరిశోధకుడిగా వ్యవహరిస్తున్న విలియం, 2002లో హార్వర్డ్ మెడికల్ స్కూల్లో పూర్తి ప్రొఫెసర్ అయ్యాడు

సర్ పీటర్ జె. రాట్క్లిఫ్ 1954 లో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లాంక్షైర్‌లో జన్మించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి మెడిసిన్ పట్టా పొంది ఆపై ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో నెఫ్రాలజీ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందారు. ఇదే విశ్వవిద్యాలయంలో స్వతంత్రంగా పరిశోధనా విభాగాన్ని ఏర్పాటుచేసి ఆ తర్వాత 1996 ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

గ్రెగ్ ఎల్. సెమెన్జా 1956లో న్యూయార్క్‌లో జన్మించారు. బోస్టన్లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి జీవశాస్త్రంలో B.A. పట్టా పొంది, 1984లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ మెడిసిన్, నుంచి MD / PhD పట్టా పొందారు. ఆ తర్వాత డర్హామ్ లోని డ్యూక్ విశ్వవిద్యాలయంలో పీడియాట్రిక్స్ నిపుణుడిగా ప్రత్యేక శిక్షణ పొందారు.

జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టోరల్ శిక్షణ తీసుకున్న సెమెన్జా, అక్కడే ఒక స్వతంత్ర పరిశోధనా బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆపి 1999 నుంచి అదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పాఠాలు చెప్తూనే 2003 నుండి జీవకణాల నిర్మాణం, వాస్కులర్ రీసెర్చ్ ప్రోగ్రాం డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.