Tokyo, September 13: జపాన్ లో నూడుల్స్ సూప్ తో తయారు చేసిన పదార్థంతో రైలును విజయవంతంగా నడిపారు. అది కూడా జపాన్ వారు ఎక్కువగా తినే రెండు రకాల వంటకాల వ్యర్థాల నుంచి రూపొందించారు. జపాన్‌లోని టాకచిహో అమటెరసు అనే రైల్వే కంపెనీ ఈ చిత్రమైన ప్రయోగం చేసి అందరినీ ఆశ్చర్యపర్చింది. జపాన్ వాసులు టొంకుట్సు రామెన్ సూప్ (పంది ఎముకలతో చేసేది), టెంపురా (కూరగాయలతోగానీ, మాంసంతోగానీ చేసే డీప్ ఫ్రై) వంటకాలను చాలా ఇష్టంగా తింటారు. ఇళ్లలో, రెస్టారెంట్లలో ఈ వంటకాలు పెద్ద ఎత్తున తయారు చేస్తుంటారు. అదే స్థాయిలో ఈ వంటకాలు వృథా అవుతుంటాయి కూడా. ఈ వృథాను అరికట్టడం, పర్యావరణానికి మేలు చేయడం లక్ష్యంగా.. జపాన్ టాకచిహో రైల్వే అధికారులు వినూత్న ప్రయోగం చేశారు.
వృథా ఆహార పదార్థాల నుంచి బయో డీజిల్ తయారు చేసి రైలును నడపాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను నిషిడా షౌన్ అనే రవాణా కంపెనీకి అప్పగించారు. నిషిడా షౌన్ సంస్థ మొదట ఈ బయో డీజిల్ తో కొన్ని రైలింజన్లను ప్రయోగాత్మకంగా నడిపి చూసింది. అది విజయవంతంగా కావడంతో ఇటీవల మియాజాకీ నగరంలో పూర్తిస్థాయిలో ఓ చిన్న ప్రయాణికుల రైలును ఆ వృథా బయో డీజిల్ తో నడిపింది. ఈ రామెన్ సూప్ బయో డీజిల్ తో కూడిన రైలు వెళుతుంటే.. దాని నుంచి వెలువడిన పొగలు సదరు వంటకం వాసనను వెదజల్లాయని ప్రయాణికులు చెబుతున్నారు. సదరు రైల్వే సంస్థ ఈ ప్రత్యేక రైలు ప్రయాణాన్ని డ్రోన్లతో వీడియో తీసి విడుదల చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.