Representational Image (Photo Credits: Pixabay)

నిన్నమొన్నటి దాకా టాప్ లో దూసుకుపోతున్న వాట్సాప్‌ కు టెలిగ్రాం (Telegram) షాకిచ్చింది. యూజర్లపై ప్రైవసీ పాలసీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందంటూ వాట్సాప్ పై (WhatsApp) విమర్శలు వచ్చిన నేపథ్యంలో అందరూ టెలిగ్రామ్‌ బాట పట్టారు. దీంతో గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌గా టెలిగ్రామ్‌ ప్రథమ స్థానానికి ఎగబాకింది. అదే యాపిల్‌ యాప్‌ స్టోర్‌ జాబితాలో నాలుగో స్థానానికి చేరింది. మొత్తంగా గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 6.3 కోట్ల ఇన్‌స్టాల్స్‌తో టెలిగ్రామ్‌ అదరగొట్టిందని, ఇది గత ఏడాది జనవరిలో కంటే 3.8 రెట్లు ఎక్కువని సెన్సర్‌ టవర్‌ అనే సంస్థ తెలిపింది.

కొన్నినెలల కిందట డౌన్ లోడ్ల పరంగా ప్లేస్టోర్ లో 9వ స్థానంలో ఉన్న టెలిగ్రాం యాప్ ఇప్పుడు నెంబర్ వన్ అయింది. ప్రైవసీ పాలసీని కచ్చితంగా అంగీకరించాల్సిందే అనేలా వాట్సాప్ నిబంధనలు తీసుకురావడంతో ఎందుకొచ్చిన బాధ అనుకుంటూ నెటిజన్లు ప్రత్యామ్నాయ యాప్ లను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారికి టెలిగ్రాం యాప్ ఉపయుక్తంగా కనిపిస్తోంది.

ఈ ఏడాది జనవరిలో టెలిగ్రాం డౌన్ లోడ్ల సంఖ్య 63 మిలియన్లు కాగా, గతేడాది జనవరిలో డౌన్ లోడ్ల సంఖ్యకు అది 3.8 రెట్లు అధికం. భారత్ లోనే అత్యధికంగా 24 శాతం డౌన్ లోడ్లు నమోదయ్యాయట. ఆ తర్వాత ఇండోనేషియాలో 10 శాతం డౌన్ లోడ్లు వచ్చాయి. ఈ మేరకు సెన్సార్ టవర్ అనే సంస్థ వెల్లడించింది.