Wrong Delivery by Flipkart: ఆన్లైన్లో రూ. 1.11 లక్షలు వెచ్చించి ఆపిల్ ఐఫోన్ 14 ప్రో ఆర్డర్ చేసిన వినియోగదారుడికి ఫోన్‌కు బదులుగా గడ్డం పెంచే నూనె (బియర్డ్ ఆయిల్) పంపిన ఘటనలో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, దాని విక్రేత ఇంటర్నేషనల్ వాల్యూ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కు.. ముంబై సబర్బన్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గట్టి షాకిచ్చింది. బాధితుడికి అసలు సొమ్ముతో పాటు రూ. 70 వేలు నష్టపరిహారం చెల్లించాలని, ఏవిధమైన పరిష్కారం చూపకుండా ఫిర్యాదులను పదేపదే మూసివేయడం 'అన్యాయమైన వాణిజ్య పద్ధతి' కిందకే వస్తుందని స్పష్టం చేసింది.
ముంబైలోని పోవైకి చెందిన ఓ వ్యక్తి ఏప్రిల్ 22, 2023న ఫ్లిప్‌కార్ట్‌లో నో-కాస్ట్ EMI కింద రూ. 1,11,793 విలువైన ఐఫోన్ 14 ప్రో (128GB) ఆర్డర్ చేశారు. విడిగా ఆర్డర్ చేసిన ఛార్జర్, ఫోన్ కవర్ సరిగ్గానే వచ్చినా, మరుసటి రోజు డెలివరీ అయిన ప్రధాన పార్సెల్‌ను తెరిచి చూడగా అందులో ఐఫోన్‌కు బదులు బియర్డ్ ఆయిల్ బాటిల్.. ప్యాకింగ్ మెటీరియల్ మాత్రమే ఉన్నాయి. దీనిపై ఆధారాలతో సహా ఏప్రిల్, మే నెలల్లో ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌ను పలుమార్లు సంప్రదించినప్పటికీ.. రీఫండ్ ఇవ్వకపోగా కస్టమర్ ఫిర్యాదును పరిష్కరించబడింది అని చూపుతూ పదేపదే క్లోజ్ చేశారు. దీంతో విసిగిపోయిన బాధితుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
ఈ కేసు విచారణలో ఫ్లిప్‌కార్ట్.. విక్రేత ఇద్దరిపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కస్టమర్ పూర్తి డబ్బు చెల్లించి ఆర్డర్ చేసినప్పుడు.. సరైన ఉత్పత్తిని అందించాల్సిన బాధ్యత పూర్తిగా ఫ్లిప్‌కార్ట్‌పైనే ఉంటుందని తెలిపింది. కేవలం అమ్మకం జరిపే ప్లాట్‌ఫామ్‌గా ఉన్నామని చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకోలేరని.. బాధితుడికి రీప్లేస్మెంట్ లేదా రీఫండ్ ఇవ్వకపోవడం స్పష్టమైన సేవా లోపమని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్, విక్రేత ఇద్దరూ కలిసి ఐఫోన్ అసలు ధర రూ. 1,11,793 మొత్తాన్ని ఏప్రిల్ 22, 2023 నుండి 9 శాతం వార్షిక వడ్డీతో కలిపి వాపసు చేయాలని కమిషన్ ఆదేశించింది. దీంతో పాటు మానసిక వేదనకు గాను రూ. 50 వేలు, కోర్టు/వ్యాజ్యపు ఖర్చుల కింద మరో రూ. 20 వేలు నష్టపరిహారంగా 45 రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఇక ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న ఆపిల్ ఇండియా, తాము కేవలం స్వతంత్ర డీలర్లకు ఉత్పత్తులను విక్రయిస్తామని.. ప్యాకేజింగ్ లేదా డెలివరీ ప్రక్రియతో తమకు సంబంధం ఉండదని తెలిపిన వాదనతో ఏకీభవించిన కమిషన్, వారిపై ఉన్న ఫిర్యాదును కొట్టివేసింది.