Mumbai, FEB 05: క్విక్ ఈకామర్స్ సంస్థలు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది బిగ్ బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జొమాటో, జెప్టో (Zepto), బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్. ఇవి మనకు అవసరమైన వస్తువులను ఆర్డర్ చేసుకున్న నిమిషాల్లోనే నేరుగా డోర్ డెలివరీ చేస్తాయి. పాలు, కూరగాయలు, నిత్యావసర సరకులు, ఫుడ్ వంటివి వీటి ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆయా సంస్థలు తొలుత ఇంటికి అవసరమైన సరకులను డెలివరీ చేసేవి. ఆ తర్వాత కస్టమర్ల డిమాండ్‌ను బట్టి స్మార్ట్ ఫోన్స్, గేమింగ్ కన్సోల్స్ ఇతర ఖరీదైన వస్తువులను కూడా నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు కార్లను కూడా డెలివరీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
స్కోడా ఇండియా పెట్టిన ఓ వీడియో ప్రస్తుతం ఆసక్తిని పెంచుతోంది. ఈ టీజర్ వీడియో చూస్తే స్కోడా ఇండియా.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ జెప్టోతో కలిసి కార్లను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో జెప్టో డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఒకరు స్కోడా షోరూమ్‌కు వెళ్తారు. అక్కడ ఓ కారును డెలివరీ చేసేందుకు ట్రక్కులో తీసుకెళ్లడం చూడొచ్చు. ఇక చివర్లో ‘Skoda x Zepto: Coming soon’ అంటూ వీడియోను ముగిస్తారు.
Zepto Delivering Cars Now
Fast × Fresh. Any guesses on what Zepto and Škoda are cooking up? Stay tuned! 👀🚗✨#SkodaIndia #SkodaIndiaNewEra #LetsExplore pic.twitter.com/tEHyvrhG4R
— Škoda India (@SkodaIndia) February 4, 2025
ఈ వీడియో షేర్ చేసిన స్కోడా ఇండియా ‘ఫాస్ట్ × ఫ్రెష్.. జెప్టో, స్కోడా ఏం చేయబోతున్నాయో మీరేమైనా ఊహించగలరా..?’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఈ సేవలు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు జెప్టో ద్వారా కార్ల విక్రయం ఎలా సాధ్యం..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కిరాణా సామగ్రి మాదిరిగానే నిమిషాల్లోనే కార్లు కూడా డెలివరీ చేస్తారా..? లేక ఎక్కువ సమయం పడుతుందా..? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.