Pakistan Bus Fire. (Photo Credits: Twitter Video Grab)

Lahore, AUG 20: పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో (Punjab province) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం పిండి భట్టియాన్‌ (Pindi Bhattian) సమీపంలో ఫైసలాబాద్‌ మోటార్‌వేపై డీజిల్‌ డ్రమ్ముల లోడ్‌ వెళ్తున్నతో ఉన్న ఓ ట్రక్కును ప్యాసింజర్‌ బస్సు (Passenger bus) ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి 16 మంది సజీవదహనమయ్యారు. మరో 15 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారని అధికారులు వెల్లడించారు. 40 మంది ప్రయాణికులతో కూడిన బస్సు కరాచీ నుంచి ఇస్లామాబాద్‌ వెళ్తుండగా ఆదివారం ఉదయం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా పోలీస్‌ ఆఫీసర్‌ ఫహద్‌ (DPO Fahad) తెలిపారు. ఇప్పటివరకు 16 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. క్షతగాత్రుల్లో నలుగురు పరిస్థితి విషమంగా ఉందన్నారు.

కాగా, వజీరిస్థాన్ ‌(Waziristan)లోని గుల్మిర్‌కోట్‌ ప్రాంతంలో జరిగిన మరో ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతిచెందారు. శనివారం రాత్రి ఉత్తర వజీరిస్థాన్‌లోని షావల్‌ ప్రాంతం నుంచి కార్మికులు వ్యాన్‌లో దక్షిణ వజీరిస్థాన్‌ ప్రాంతానికి వెళ్తుండగా గుల్మిర్‌కోట్‌ ప్రాంతంలో ల్యాండ్‌మైన్‌ పేలింది. దీంతో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.