Kabul, August 19: కాబూల్ నగరాన్ని తాలిబాన్లు చుట్టుముడుతున్నారన్న సమాచారం తెలియగానే పత్తాలేకుండా దేశం విడిచి పారిపోయిన అఫ్ఘనిస్తాన్ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. దేశం విడిచి వెళ్లిపోవాలనే తన నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. దేశంలో మరింత రక్తపాతం జరగకుండా అడ్డుకునేందుకే తాను తన ప్రజల క్షేమం కోసమే దేశాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందని పునరుద్ఘాటించారు. తాను అక్కడే ఉండి ఉంటే ప్రజలచే ఎన్నిక కాబడిన ఓ అఫ్ఘాన్ అధ్యక్షుడిని తాలిబాన్లు వారి ప్రజల కళ్ల ముందే ఉరితీసేవారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, తాను మిలియన్ డాలర్ల దేశ ఖజనాతో పారిపోయాననే వార్తలను అష్రఫ్ ఘనీ ఖండించారు. కేవలం కట్టుబట్టలతో, వేసుకున్న చెప్పులతో దేశం విడిచి వచ్చానని ఆయన చెప్పారు. ప్రస్తుతం యూఎఈలో ఉంటున్నట్లు స్వయంగా చెప్పిన అష్రఫ్, ఇక్కడ ఓ ప్రవాస దేశస్థుడిగా తనకు ఉండే ఉద్దేశ్యం లేదని ఆఫ్ఘనిస్తాన్‌కు తిరిగి రావడానికి తాను సంప్రదింపులు జరుపుతున్నానని వెల్లడించారు. సామాజిక న్యాయం, ఆఫ్ఘన్ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి తన దేశ ప్రజలకు హామీ ఇచ్చానని మరియు నిజమైన ఇస్లామిక్ విలువలు, జాతీయ లక్ష్యాలను పునరుద్ధరించడానికి తన పోరాటం కొనసాగిస్తానని ఘనీ స్పష్టం చేశారు.
తాలిబాన్ల ఆక్రమణతో అప్ఘనిస్తాన్ లోని ప్రజల పరిస్థితి అల్లకల్లోలంగా, అత్యంత దయనీయంగా మారిన తరుణంలో ఏకంగా ఆ దేశ అధ్యక్షుడే దేశం విడిచి పారిపోవడంతో అంతర్జాతీయంగా అష్రఫ్ ఘనీ ప్రతిష్ఠ దిగజారింది. అంతేకాకుండా ఒక హెలికాప్టర్ నిండా డబ్బుతో పారిపోయాడని అఫ్గాన్ నేతలు ఆరోపించగా, 169 మిలియన్ డాలర్లను అఫ్ఘాన్ ప్రజల సొమ్ము దొంగిలించాడంటూ తజికిస్థాన్‌లోని ఆఫ్ఘనిస్తాన్ రాయబారి ఆరోపించారు, ఆయనపై ఇంటర్ పోల్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.
దేశం విడిచిన తర్వాత అష్రఫ్ ఘనీ ఎక్కడ ఉన్నారనే అచూకీ తెలియరాలేదు. ఆయన తజికిస్తాన్ వెళ్లటానికి ప్రయత్నించగా అక్కడి ప్రభుత్వం ఆయనను తమ దేశంలోకి అనుమతించలేదని తెలిసింది. దీంతో రహస్యంగా అమెరికా వెళ్లారా? అనుకుంటున్న సమయంలో అష్రఫ్ ఘనీ తమ దేశంలోనే ఉన్నారంటూ యూఎఈ ప్రభుత్వం ప్రకటించింది. ఆష్రఫ్ ఘనీ మరియు ఆయన కుటుంబాన్ని మానవతావాదంతో తమ దేశంలో ఆశ్రయం కల్పించామని, ఆయన అబుదాబిలో ఉన్నారని యూఎఈ ప్రభుత్వం తెలిపింది. కాగా, యూఎఈ ఈ ప్రకటన చేసిన కొద్దిసేపట్లోనే తాను అఫ్ఘనిస్తాన్ వచ్చేస్తానని అష్రఫ్ ఘనీ వీడియో ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
అఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్లు తమ స్వాధీనం చేసుకున్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాలేదు. ఎవరి అధ్యక్షతన ప్రభుత్వం ఉండాలనే దానిపైనే తాలిబాన్ నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నారు. అఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో భారత్ మరియు యూఎస్ దేశాలు వ్యూహాత్మక చర్చలు జరుపుతున్నాయి. అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదానికి చోటు లేని ప్రభుత్వం అవసరమని ఇరు దేశాల ప్రతినిధులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఫ్ఘనిస్తాన్‌లో భారత్ సుమారు 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టగా, అమెరికా గత రెండు దశాబ్దాలుగా లెక్కకు మించి ఖర్చు చేసింది. ఈ క్రమంలో యూఎస్ మరియు ఇండియా పునరాలోచనలో పడ్డాయి. అయితే యూఎస్ ఇకపై నేరుగా అఫ్ఘనిస్తాన్ వ్యవహారాల్లో తలదూర్చకుండా భారత్ ను వాడుకోవాలని చూస్తుందా? అనే అభిప్రాయాలను కొందరు మేధావులు యూఎస్ వైఖరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.