తాలిబన్లకు తొలి నుంచీ మద్దతుగా నిలుస్తున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘాన్ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని చెప్పే ప్రయత్నం చేశారు. అఫ్ఘాన్ ప్రజల బానిస సంకెళ్లను తాలిబన్లు తెంచేశారని తాజాగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన, పాశ్చాత్య సంస్కృతికి తలొగ్గడంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇతరుల సంస్కృతికి అలవాటు పడిన వారు మానసికంగా ఆ సంస్కృతికి తలొగ్గుతారు. ఇది బానిసత్వం కంటే దారుణమైదని మనం గుర్తించాలి. సాంస్కృతిక బానిసత్వ బంధనాలను తెంచడం మరింత కష్టం. అయితే.. అఫ్ఘానిస్థాన్‌లో ఈ సంకెళ్లు తెగిపోవడం మనం ప్రస్తుతం చూస్తున్నాం’’ అని ఇమ్రాన్ ఖాన్ తాజాగా వ్యాఖ్యానించారు.
అఫ్ఘానిస్థాన్ తాలిబన్ల వశం కావడంతో ఆ దేశ భవిష్యత్తుపై, అక్కడి మహిళలు, మైనారిటీల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు.. తాలిబన్ల ప్రభుత్వాన్ని ఎవరూ గుర్తించకూడదని బ్రిటన్ ప్రధాని తాజాగా అభిలషించారు. ప్రజస్వామ్య దేశాలన్నీ దాదాపుగా ఇదే పంథాను ఎంచుకున్నాయి.
అఫ్ఘానిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత తొలిసారిగా చైనా స్పందించింది. తాలిబన్లతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకోవాలన్న అఫ్ఘాన్ ప్రజల హక్కును చైనా గౌరవిస్తోంది. ఆ దేశంతో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అంటూ విదేశాంగ శాఖ ప్రతినిధి తాజాగా వ్యాఖ్యానించారు.