Protestors gather at the corner of Grove and College Streets (Photo/Reuters)

New York, April 24: పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు (US Universities) అట్టుడుకుతున్నాయి. గాజా పోరులో (Gaza Protests) ఇజ్రాయెల్‌కు మద్దతుగా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు ఆందోళనలకు దిగారు. గత కొన్ని రోజులుగా తరగతి గదులను బహిష్కరించి పాలస్తీనాలకు అనుకూలంగా నిరసనలు చేపడుతున్నారు (pro-Palestinian protests). దీంతో సామూహిక అరెస్టులు, తరగతుల బహిష్కరణ (shut down classes)తో వర్సిటీలు అట్టుడుకుతున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం వల్ల గాజాలో తలెత్తిన మానవ సంక్షోభ పరిస్థితులపై విద్యార్థులు మండిపడుతున్నారు. పాలస్తీనా మహిళలు, చిన్నారుల మరణాలకు బైడెన్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. విద్యార్థుల నిరసనలతో యేల్‌, ఎంఐటీ, హార్వర్డ్‌, కొలంబియా తదితర విశ్వవిద్యాలయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

దీంతో కొలంబియా వర్సిటీ తరగతి గదులను కూడా మూసివేసింది. మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. అయితే ఈ నిరసనలపై ఇజ్రాయెల్ అనుకూల మద్దతుదారులు, ఇతర విద్యార్థులు క్యాంపస్ లలో తమ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని క్యాంపసులు దాడులు, బెదిరింపులు, విద్వేషపూరిత ప్రసంగాలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు క్యాంపస్‌లో విద్యార్థుల నిరసనలపై కొలంబియా వర్సిటీ అధికారులు స్పందించారు . విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని, కానీ ఇతర విద్యార్థులను వేధించేందుకు, భయపెట్టేందుకు, క్యాంపస్‌లో ఇబ్బందులు సృష్టించేందుకు వీల్లేదని తెలిపారు. యూదు విద్యార్థుల భయాందోళనలపై తాము తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వర్సిటీ అధికారులు నిరసనకారులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.