Bangladesh Violence

Dhaka, AUG 04: బంగ్లాదేశ్ రిజర్వేషన్లకు (Bangladesh)వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సాయంత్రం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 32 మంది ప్రాణాలు వదిలారు. ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేయాలంటూ విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం.. ఫెనిలో జరిగిన హింసలో (Bangladesh Violence) ఐదుగురు ప్రాణాలు వదిలారు. సిరాజ్‌గంజ్‌లో నలుగురు, మున్షిగంజ్‌లో ముగ్గురు, బోగురాలో ముగ్గురు, మగురాలో ముగ్గురు, భోలాలో ముగ్గురు, రంగ్‌పూర్‌లో ముగ్గురు, పబ్నాలో ఇద్దరు, సిల్హెట్‌లో ఇద్దరు, కొమిల్లాలో ఒకరు, జైపూర్‌హాట్‌లో ఒకరు, ఢాకాలో ఒకరు, బారిసాల్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దాంతో హోంమంత్రిత్వ శాఖ ఆదివారం సాయంత్రం దేశవ్యాప్తంగా కర్ఫ్యూను ప్రకటించింది. అలాగే, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, మొబైల్‌ ఇంటర్‌నెట్‌ సేవలను సైతం నిలిపివేశారు. ఆదివారం అవామీ లీగ్‌ మద్దతుదారులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. షేక్ హసీనా తన వ్యక్తిగత నివాసం గణభబన్‌లో భద్రతా వ్యవహారాలపై జాతీయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరసనల పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారు విద్యార్థులు కాదు ఉగ్రవాదులని.. గట్టి సమాధానం ఇవ్వాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాన్నారు.

 

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, సెక్యూరిటీకి సంబంధించిన ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని భద్రతా సలహాదారు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 200 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారు. శనివారం ప్రధాని షేక్‌ హసీనా విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లతో సమావేశమయ్యారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను చర్చల కోసం తన ప్రైవేట్ నివాసానికి పిలిచారు. ఆందోళనకారులు ప్రధానితో ఎలాంటి చర్చలకు నిరాకరించారు. షేక్ హసీనా రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.