Dhaka, August 5: బంగ్లాదేశ్ (Bangladesh)లో పరిస్థితి అదుపుతప్పింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది.తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవికి అవామీ లీగ్ ప్రెసిడెంట్ షేక్ హసీనా(Sheikh Hasina) రాజీనామా చేశారు.బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా వార్తల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నిరసనకారులు హింసామార్గాన్ని విడనాడాలని పిలుపునిచ్చారు.
హసీనా దేశం విడిచి వెళ్లిపోయారని సైన్యం ప్రకటించగానే.. రోడ్ల మీదకు చేరిన లక్షల మంది నినాదాలు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపుల్లోకి వచ్చే దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని ఆర్మీ ప్రకటించింది. బంగ్లాదేశ్‌లో ఎందుకీ ఆందోళనలు? విద్యార్థులు చేపట్టిన ఉద్యమం రాజకీయ నిరసనగా ఎందుకు మారింది, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానంపై ఎవరేమన్నారు ?
బంగ్లాదేశ్ (Bangladesh) లో రాజకీయ సంక్షోభం (Political crisis) నేపథ్యంలో భారత సరిహద్దులను రక్షించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అప్రమత్తమైంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి హై అలర్ట్ (High alert) ప్రకటించింది. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. తాజా పరిస్థితి నేపథ్యంలో ముందస్తు చర్యల కోసం బీఎస్‌ఎఫ్ డీజీ ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.