Paris, May 20: బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson ) 58 ఏళ్ల వయసులో ఎనిమిదో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని జాన్సన్ భార్య క్యారీ సిమండ్స్ (carrie symonds) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మరి కొన్ని వారాల్లో తమ కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నాడంటూ ప్రకటించింది. తన ఇద్దరు పిల్లలతో ఉన్న ఫొటోను పంచుకుంది. కాగా, 35 ఏళ్ల క్యారీ సిమండ్స్‌తో బోరిస్ కొన్నేళ్లు సహజీనం చేశాడు. అనంతరం 2021 మేలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏప్రిల్ 2020లో విల్ఫ్ (Wilf) జన్మించగా.. డిసెంబర్ 2021లో రోమీ (Romy ) జన్మించాడు. ఇప్పుడు క్యారీ మూడో బిడ్డకు జన్మనివ్వబోతోంది. బోరిస్‌కు ఇది మూడో వివాహం.
View this post on Instagram
బోరిస్ జాన్సన్ తొలుత 1987లో కళాకారిణి, జర్నలిస్టు అలెగ్రా మోస్టిన్ ఓవెను (Allegra Mostyn Owen) వివాహం చేసుకున్నాడు. అయితే అనుకోని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. అప్పుడు వీరికి ఎలాంటి సంతానం కలగలేదు. ఆ తర్వాత 1993లో భారత సంతతికి చెందిన న్యాయవాది, జర్నలిస్టు మెరీనా వీలర్ (Marina Wheeler)ను పెళ్లాడారు. 25 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం తాము విడాకులు తీసుకుంటున్నట్లు జాన్సన్-వీలర్ 2018లో ప్రకటించారు. 2020లో ఈ విడాకుల తంతు పూర్తయ్యింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ ప్రకారం.. ఆర్ట్ కన్సల్టెంట్ హెలెన్ మాకిన్‌టైర్ ( Helen Macintyre)తో ఎఫైర్ కారణంగా బోరిస్‌కు మరో బిడ్డ ఉన్నాడు.