Bejing, May 24: కరోనా పోయింది.. ఇప్పుడు అంతా మామూలే.. అని ప్రపంచం ఊపిరిపీల్చుకుంటున్నవేళ చైనాలో కొవిడ్-19 మళ్లీ విజృంభిస్తున్నది. చైనాలో కొవిడ్ కొత్త వేవ్ (China Covid Wave) మొదలైందని బయోటెక్ సదస్సులో పాల్గొన్న శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు జోంగ్ నాన్షాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా మళ్లీ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వడానికి ఒమిక్రాన్, ఎక్స్‌బీబీ వేరియెంట్ (XBB Variant) కారణమని చెప్పారు. ఎక్స్‌బీబీ వేరియెంట్ భారీ ఎత్తున వ్యాప్తి చెందుతున్నదని, మేలో ప్రతివారం 4 కోట్ల కోవిడ్ కేసులు నమోదయ్యే అవకాశముందని ‘బ్లూమ్‌బర్గ్’ నివేదిక పేర్కొంది. జూన్ చివరినాటికి 6.5 కోట్లకు (ప్రతివారం) చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. ‘జీరో కొవిడ్’ పాలసీని పక్కకు పెట్టాక చైనాలోకరోనా కేసులు పెరగటం మొదలైంది.
ఆరు నెలలుగా ‘చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్, ప్రివెన్షన్’ కొవిడ్ తాజా గణాంకాల్ని విడుదల చేయటం లేదు. దీంతో కొత్త వేవ్ ప్రభావం చైనాపై ఏ మేరకు ఉందన్నదానిపై వైద్య నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది చివర్లో మొదలైన కొవిడ్ వేవ్ ఈ ఏడాది జనవరి వరకు కొనసాగింది. ఈ వేవ్‌లో ప్రతిరోజూ 3.7 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు కొత్త వేవ్ మొదలవ్వటంతో ఎక్స్‌బీబీ వేరియెంట్‌ను ఎదుర్కొనేందుకు బూస్టర్ డోస్ ఇవ్వడానికి చైనా హడావిడిగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.