
Beijing, DEC 30: చైనాలో కరోనా ఆంక్షలన్నీ (Covid Rules) ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో ఆ దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్నది. ప్రతి రోజూ లక్షల్లో కరోనా కేసులు, వేలల్లో కరోనా మరణాలు (Corona Deaths) నమోదవుతున్నాయి. అయితే ఈ గణంకాలను చైనా అధికారికంగా విడుదల చేయడం లేదు. కాగా, బ్రిటన్‌కు చెందిన ఒక ఆరోగ్య సంస్థ చైనాలో (China Corona) నమోదవుతున్న కేసులు, మరణాల డాటాను గురువారం వెల్లడించింది. డిసెంబర్ 1 నుంచి నెలాఖరు వరకు 1.86 కోట్ల మంది కరోనా బారినపడినట్లు తెలిపింది. అలాగే ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరినట్లు పేర్కొంది. గత వారం కంటే కరోనా మరణాలు రెట్టింపు అయ్యాయని, పత్రి రోజూ సుమారు 9 వేల మరణాలు నమోదవుతున్నట్లు వెల్లడించింది.
మరోవైపు కొత్త ఏడాది జనవరిలో చైనాలో మరింతగా కరోనా విజృంభిస్తుందని బ్రిటన్‌కు (Britain) చెందిన ఆ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జనవరి 13 నాటికి కరోనా కేసులు తీవ్ర స్థాయికి చేరుతాయని, రోజుకు 37 లక్షల కేసులు నమోదవుతాయని అంచనా వేసింది. అలాగే జనవరి 23 నాటికి రోజువారీ కరోనా మరణాల సంఖ్య 25,000కు పెరుగుతుందని పేర్కొంది. చైనాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,84,000కు చేరవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.