Beijing, October 26: చైనాలో మరోసారి కోవిడ్-19 విజృంభిస్తోంది. చైనా రాజధాని బీజింగ్‌లో పలు ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. కొన్ని చోట్ల మీడియం రిస్క్ ఉన్న ప్రాంతాలుగా, మరికొన్నింటిని హైరిస్క్ ఉన్న ప్రాంతాలుగా గుర్తించారు. బీజింగ్‌లో కోవిడ్-19 కేసుల సంఖ్య 21కి చేరింది. మిగిలిన ప్రాంతాల్లో 33 కొత్త కేసులు నమోదు కావడంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. అయితే డెల్టా వేరియంట్ కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
బీజింగ్‌లోని చాంగ్‌పాంగ్ జిల్లాను మీడియం రిస్క్ ఉన్న ప్రాంతంగా గుర్తించారు. అక్కడ సోమవారం నాడు రెండు కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బీజింగ్ అంటువ్యాధుల నిరోధక డిప్యూటీ డైరక్టర్ పాంగ్ జింగ్‌హువో ఈ విషయాన్ని వెల్లడించారు.
చాంగ్ పాంగ్ జిల్లాలోని మరో నివాస ప్రాంతంలో కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో దాన్ని కూడా రిస్క్ జోన్‌గా ప్రకటించారు. ఈ జిల్లాలో రెండు ప్రాంతాలు మినహా అన్ని చోట్ల కోవిడ్-19 కేసుల తీవ్రత తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు చైనా న్యూస్ ఏజెన్సీ జిన్‌హువా కథనం ప్రచురించింది.
ఒక్కసారిగా కోవిడ్-19 కేసులు పెరగడంతో చైనాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 2022 ఫిబ్రవరిలో జరుగనున్న శీతాకాల ఒలింపిక్స్ కు చైనా ఆథిత్యం ఇస్తుండటంతో కోవిడ్-19 తీవ్రత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వీలైనంత తొందరగా కోవిడ్-19 ను అదుపులోకి తెచ్చేందుకు యంత్రాంగం పరుగులు పెడుతోంది.
చైనాలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరగడానికి డెల్టా వేరియంట్ కారణమని భావిస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా 55 ఏళ్లు దాటిన వృద్ధులకే సోకాయి. చైనా జాతీయ హెల్త్ కమిషన్ పరిశోధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల నుంచే కోవిడ్-19 పాజిటివ్ కేసుల తీవ్రత పెరిగినట్లు గుర్తించారు. అంటువ్యాధుల నిపుణులు తాజా కేసులకు సంబంధించిన జీనోమ్ సీక్వెన్స్ చేయడటంతో ఈ విషయం బయటపడింది.
తాజాగా నమోదువుతున్న డెల్టా వేరియంట్ కేసులకు సంబంధించిన పూర్వాపరాలు కనుగొనేందుకు నేషనల్ హెల్త్ కమిషన్ పరిశోధనలు జరుపుతున్నట్లు ఆ సంస్థకు చెందిన అధికారి తెలిపారు.
నేషనల్ హెల్త్ కమిషన్ సోమవారం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆదివారం నాడు 33 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ బీజింగ్ వెలుపల నమోదయినవేనని ఆ సంస్థ తెలిపింది. ఇన్నర్ మంగోలియా, గన్‌సూ, హెబ్బీ, హునాన్, జుయిజ్‌హోయూ, శాన్‌జీ ప్రాంతాల్లోనే ఈ కేసులు నమోదయ్యాయి.
టియాన్‌జిన్, షాంఘై, షాన్‌డోంగ్, గువాన్‌జి ప్రాంతాల్లో ఒక్కొక్కరి చొప్పున విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా సోకినట్లు గుర్తించారు. దీంతో మెయిన్‌ల్యాండ్‌లో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్-19 కేసులు 96,767కు చేరుకున్నాయి. వీరిలో 537 మందికి ఇంకా చికిత్స కొనసాగుతోంది. అందులో 20 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇక కరోనా కారణంగా ఇప్పటివరకు 4,636 మంది మృతి చెందినట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది.