Hyderabadi US Senator: చరిత్ర సృష్టించిన హైదరాబాదీ, అమెరికాలో ట్రంప్ పార్టీ అభ్యర్థిని ఓడించి సెనేటర్‌గా గెలుపొందిన ఘజాలా హష్మి, అమెరికాలో తొలి ముస్లిం మహిళ సెనేటర్‌గా రికార్డ్
Ghazala Hashmi. (Photo Credits: IANS)

Virginia / Hyderabad, November  7:  భారతీయులు ప్రత్యేకంగా హైదరాబాదీలు గర్వంగ చెప్పుకునే విషయం. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం 10వ జిల్లా (Virginia's 10th Senate district) లో భారతీయ-అమెరికన్ డెమొక్రాట్ (Democrat) ఘజాలా హష్మి (Ghazala Hashmi), అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అధికార రిపబ్లికన్ పార్టీ (Republican Party) మరియు సిట్టింగ్ సెనేటర్ అభ్యర్థి అయిన గ్లెన్ స్టర్టెవాంట్ (Glen Sturtevant) పై అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయంతో ఘజాలా హష్మి అమెరికాలో తొలి ముస్లిం సెనెటర్ గా గెలుపొంది చరిత్ర సృష్టించారు.

తన ఇంట్లో అందరూ 'మున్ని' గా పిలుచుకునే ఘజాలా పుట్టి పెరిగింది హైదరాబాదే, ఆ తర్వాత వారి ఫ్యామిలీ అమెరికాకు షిఫ్ట్ అయింది. అక్కడే ఉన్నత విద్యలను అభ్యసించింది. ఘజాలా హష్మి, అమెరికాలోని జార్జియా సదరన్ విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషులో గ్రాడ్యుయేషన్ పట్టా మరియు ఎమ్రాయ్ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్ డి సంపాదించారు. ఆమె భర్తతో పాటు ఇద్దరు కుమార్తెలతో వర్జీనియాలో చాలా కాలంగా నివాసం ఉంటున్నారు.

రెండు దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆమె ఆ రంగంలో ఎన్నో హోదాలలో పనిచేశారు. 'సెంటర్ ఫర్ ఎక్సిలెన్స్ టీచింగ్ అండ్ లర్నింగ్' డైరెక్టర్ పదవికి ఇటీవలే రాజీనామా చేసిన ఆమె, సెనేటర్స్ ఎన్నికల్లో పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. హష్మి ఇప్పుడు వర్జీనియా యొక్క 10వ సెనేట్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారు.

Indian-American Democrat Ghazala Hashmi

ఈ విజయాన్ని హష్మి ప్రజలకు అంకితమిచ్చారు. "ఈ విజయం, నాది మాత్రమే కాదు, వర్జీనియాలో ప్రగతిశీల మార్పును కోరుతూ తనని విశ్వసించి ఓట్లు వేసిన అందరిదీ,  జనరల్ అసెంబ్లీలో మీ అందరి గొంతుక నేనవుతాను" అంటూ ఆమె ట్వీట్ చేశారు.

అమెరికాలో గన్ కల్చర్, హింసాత్మక దాడులు తదితర సమస్యలపై గళమెత్తుతూ ఆమె చేసిన ప్రచారం ఓటర్లను బాగా ఆకర్శించింది. అదే కాకుండా వర్జీనియాలో భారతీయుల శాతం పెరగటం, ఆ ఓట్లు కూడా కలిసిరావడం ఆమె విజయానికి మరో కారణంగా తెలుస్తుంది.