Former Us President Donald Trump (PIC@ ANI twitter)

Washington, April 05: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump  Areest) అరెస్టయిన విషయం విధితమే. అమెరికా చరిత్రలోనే మాజీ అధ్యక్షుడు అరెస్ట్ కావడం ఇదే తొలిసారి. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ తో సంబంధాన్ని దాచిపెట్టి ఉంచేందుకు ఆర్థికంగా ప్రలోభపెట్టినట్లు ట్రంప్ ఆరోపణలు (Criminal Charges) ఎదుర్కొంటున్నారు. ఈ హుష్ మనీ కేసులో పోలీసులు ట్రంప్‌ను (Donald Trump) అరెస్ట్ చేశారు. అనంతరం భారత కాలమానం ప్రకారం.. రాత్రి 11.45 గంటలకు (అమెరికాలో సమయం మధ్యాహ్నం 2.15 గంటలు) న్యాయమూర్తి జువాన్ మెర్చన్ ఎదుట న్యూయార్క్ మన్‌హటన్‌లోని కోర్టు ముందు ట్రంప్ ను పోలీసులు హాజరుపర్చారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో విచారణల్లో నిందితులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకెళ్తారు. కానీ ట్రంప్ కు ఈ విషయంలో మినహాయింపును ఇచ్చారు. ట్రంప్ తన న్యాయవాదులతో కలిసి కోర్టు విచారణలో పాల్గొన్నారు. అయితే మొత్తం 34 అభియోగాలను ట్రంప్ ఎదుర్కొంటున్నారు.

తనపై మోపిన అభియోగాల్లో తాను దోషిని కానని, తనపై మోపిన అభియోగాలను తప్పుడుగా భావించి వాటిని కొట్టివేయాలని ట్రంప్ కోర్టు ముందు విన్నవించుకున్నారు. విచారణ అనంతరం కోర్టు నుంచి బయటకు వచ్చిన ట్రంప్.. ఫ్లోరిడాలోని తన నివాసం మార్ – ఏ – లాగో నుంచి తన మద్దతు దారులను ఉద్దేశించి మాట్లాడారు.మన దేశం నాశనమవుతోంది. నరకానికి వెళ్తోంది, ప్రపంచ మనదేశాన్ని చూసి నవ్వుతుంది అంటూ అధికార పార్టీపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమెరికా చరిత్రలో అత్యంత చీకటి ఘడియలలో మనం జీవిస్తున్నామని పేర్కొన్న ట్రంప్.. కనీసం ఈ క్షణమైనా నేను గొప్ప ఉత్సాహంతో ఉన్నానని అన్నారు. అమెరికాలో ఇలాంటివి జరుగుతాయని నేను ఎప్పుడూ అనుకోలేదని తనపై నేరారోపణల గురించి ట్రంప్ ప్రస్తావించారు. ఇది తప్పుడు కేసు. రాబోయే 2024 ఎన్నికల్లో తన జోక్యాన్ని అడ్డుకొనేందుకు మాత్రమే దీనిని తెరపైకి తెచ్చారని ట్రంప్ అన్నారు. నేను చేసిన నేరం ఏమిటంటే దేశాన్ని నాశనం చేయాలనుకునే వారి నుంచి రక్షించేందుకు ప్రయత్నించడమే అని ట్రంప్ అన్నారు. ఇది దేశానికి అవమానమని ట్రంప్ పేర్కొన్నారు.