Guayaquil, JAN 10: ఈక్వెడార్ (Ecuador) రాజధాని గ్వయకిల్‌లో మంగళవారం సాయుధులైన కొందరు దుండగులు టీసీ టీవీ ఛానెల్ లైవ్ స్టూడియోలోకి (Ecuadorean television station TC) ప్రవేశించి తీవ్ర కలకలం సృష్టించారు. మాస్క్‌లు ధరించి తుపాకులు (Guns), డైనమైట్‌లతో వచ్చిన వీరు.. వార్తలు చదువుతున్న వ్యక్తి సహా అక్కడ ఉన్న ఇతర ఉద్యోగులను బెదిరించారు. వారిని నేలపై కూర్చోబెట్టి తలపై తుపాకీ (Guns) ఎక్కుపెట్టారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని, పోలీసులెవరూ ఇక్కడికి రారంటూ బెదిరించారు. ఇదంతా టీవీ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది. లైవ్‌లో తుపాకీ శబ్దాలూ వినిపించాయి.
BREAKING - Gunmen burst into Ecuador TV studio live on air
— Insider Paper (@TheInsiderPaper) January 9, 2024
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పోలీసులు తర్వాత వెల్లడించారు. ప్రస్తుతం 13 మంది నిందితులను అదుపులోకి తీసుకొని, ఉగ్రవాద చర్యల కింద కేసు నమోదు చేశారు. ఈ దాడి వెనుక ఉన్నది ఎవరనే విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల జైళ్ల నుంచి ఇద్దరు డ్రగ్ గ్యాంగ్‌స్టర్లు తప్పించుకున్నారు. ఆ తర్వాతే దేశంలో వరుసగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా ఘటన అందులో భాగమే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. టీసీ టీవీ ఛానెల్ అధిపతి మాన్రిక్ మాట్లాడుతూ.. ‘‘దుండగులు కార్యాలయంలోకి వచ్చినప్పుడు నేను కంట్రోల్ రూమ్‌లో ఉన్నాను. వారిలో ఒకరు నా దగ్గరకొచ్చి తలపై తుపాకీ గురిపెట్టాడు. నేలపై కూర్చోవాలని బెదిరించారు. నేనింకా షాక్‌లోనే ఉన్నాను. ఈ దేశాన్ని విడిచి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలనిపిస్తోంది’’ అని చెప్పారు. స్టూడియోలో జరుగుతున్న ఘోరమంతా దాదాపు 15 నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారమైందన్నారు. పోలీసులు చుట్టుముట్టారని గుర్తించిన దుండగులు తర్వాత తప్పించుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు.
Que pena todo lo que esta pasando con los hermanos del canal tc televisión, Dios los cuide pic.twitter.com/behRNVacSz
— Emergencias Ec (@EmergenciasEc) January 9, 2024
ఈక్వెడార్‌లో (Ecuador) గత కొన్ని రోజులుగా వరుస దాడులు జరుగుతున్నాయి. కొందరు పోలీసు ఉన్నతాధికారులు అపహరణకు గురయ్యారు. గ్యాంగ్‌స్టర్లు తప్పించుకోవడం వల్లే ఇదంతా జరుగుతోందని పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశాధ్యక్షుడు డేనియల్ నోబోవా (President Daniel Noboa) సోమవారం అత్యవసర పరిస్థితి విధించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సైనిక బలగాల మోహరింపునకు ఆదేశాలు జారీ చేశారు. టీవీ ముట్టడి తర్వాత నోబోవా మంగళవారం మరో కీలక ప్రకటన చేశారు. మాదకద్రవ్యాలను సరఫరా చేసే 20 ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు. వీటికి చెందిన సభ్యులు ఎక్కడ కనిపించినా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా హతమార్చేందుకు సైనికులకు అధికారం ఇచ్చారు. దేశం ప్రస్తుతం అంతర్గత సాయుధ ఘర్షణలను ఎదుర్కొంటోందని ప్రకటించారు. ఈక్వెడార్‌లో (Ecuador) శాంతిని పునఃస్థాపించే వరకు పోరాడతామని తెలిపారు.