Pakistan On War: అక్టోబర్ నెలలో భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం ప్రారంభం కాబోతుంది. పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశం ఉందంటూ జోస్యం చెప్పిన పాకిస్థాన్ మంత్రి.
Flags of India and Pakistan | Representational Image | (Photo Credits: PTI)

Rawalpindi, August 28: అక్టోబర్ నెలలో భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ (Sheikh Rashid Ahmed) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం రోజున తన స్వస్థలం అయిన రావల్పిండిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాక్ మంత్రి షేక్ రషీద్ ప్రసంగించారు. ఈ అక్టోబర్‌లో లేదా ఆ తరువాతి నెలలో ఇండియా - పాక్ దేశాలకు మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం జరగబోతుందని ఆయన జోస్యం చెప్పారు.

కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, " ఇక కాశ్మీర్ లోయలో ఆఖరి స్వాతంత్య్ర పోరాటానికి సమయం ఆసన్నమైంది. కాశ్మీర్ అంశాన్ని ఐరాస వద్దకు తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఈ సమస్యను నిజంగా పరిష్కరించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి) భావించి ఉంటే ఇప్పటివరకు కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ఉండేది. కానీ, అలా జరగలేదు. మనమంతా కాశ్మీర్ ప్రజలకు అండగా నిలబడాలి. మొహర్రం 10 తర్వాత నేను మరోసారి కాశ్మీర్ ప్రాంతంలో పర్యటిస్తాను." అని ఆయన ప్రసంగించిన వీడియోను 'పాకిస్థాన్ టుడే' ప్రచురించింది.

 

రషీద్ అహ్మద్ ఒక వైపు చైనా దేశాన్ని మెచ్చుకుంటూ, మరోవైపు భారత ప్రధానిని నరేంద్ర మోదీ ఒక అనాగరికుడు, నియంత అంటూ తీవ్ర విమర్శలు చేశాడు.

ఇటీవల, పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా తన ప్రజలనుద్దేశించి ప్రసంగించినపుడు, పాకిస్థానీయులంతా ఐకమత్యంగా ఉండాలి. ఇండియా మొదలు పెట్టిన కథను మనం ముగించాలి అంటూ వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీర్ అంశంలో మద్ధతు కరువై ఏకాకిగా నిలిచిన ఆయన మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది అనేంతగా మాట్లాడాడు. ఏదైనా జరిగితే దాని ప్రభావం అన్ని దేశాలపై ఉంటుందని కూడా హెచ్చరించారు. అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై ఏ దేశమూ రియాక్ట్ కాలేదు. సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితిలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించనున్నారు. కాశ్మీర్ అంశంలో అప్పుడు కూడా ఎవరూ తమకు  మద్ధతు ఇవ్వడానికి ముందుకు రాకపోతే, "మేమూ చావాలి, మాతో పాటు అందరూ చావాలి". అన్నట్లుగా పాకిస్థాన్ ఆలోచిస్తున్నట్లు అర్థమవుతుంది. అందుకే అక్టోబర్ లో యుద్ధం రావచ్చు అని పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇదిలా ఉండగా, కరాచీ సమీపంలోని సోన్మియా వైమానిక ప్రయోగ స్థావరం నుండి క్షిపణి ప్రయోగాలకు ఏమైనా అవకాశం ఉందేమో చూడాలంటూ పాకిస్తాన్ ఎయిర్ మెన్ (NOTAM) మరియు నేవీ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

అయితే భారత్ మాత్రం, పాక్ దూకుడు చర్యల పట్ల ప్రశాంతంగా వ్యవహరిస్తుంది. పాకిస్థాన్ ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా, తనపని తాను చేసుకుంటూ పోతూనే పాక్ చర్యలను నిశితంగా గమనిస్తుంది. మాటల్లేకుండా, నేరుగా జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉంది.