America on Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌పై అమెరికా కీలక వ్యాఖ్యలు, ఏ రాజకీయ పార్టీ పక్షాన గానీ, వ్యక్తల పక్షాన గానీ నిలబడమని స్పష్టం
US Congressman Brad Sherman (Photo-Twitter)

New York, May 10: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‍ మంగళవారం సాయంత్రం అరెస్టయిన విషయం తెలిసిందే. అవినీతి కేసు విచారణలో భాగంగా ఇస్లామాబాద్ హైకోర్టులో హాజరయ్యేందుకు వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.కాగా ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది.

ఇమ్రాన్ అరెస్టు విషయం తమ దృష్టికి వచ్చిందని, అయితే ప్రజాస్వామ్య విలువలు, సమన్యాయ పాలనను పాక్ ప్రభుత్వం గౌరవించాలని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. తాము ఏ రాజకీయ పార్టీ పక్షాన గానీ, వ్యక్తల పక్షాన గానీ నిలబడమని స్పష్టం చేసింది. కానీ ప్రజాస్వామ్య విలువలను అన్ని దేశాలు గౌరవించాలని కోరుకుంటామని తెలిపింది.

ఇమ్రాన్ అరెస్టుతో అట్టుడుకుతున్న పాకిస్తాన్, ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని తమ పౌరులను హెచ్చరించిన యూఎస్‌, యూకే, కెనడా

పాకిస్తాన్‌తో బ్రిటన్‌కు దీర్ఘకాల సంబంధాలున్నాయని బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి క్లెవర్లీ తెలిపారు. తామిద్దరం కామన్‌వెల్త్ భాగస్వాములమన్నారు. అయితే పాకిస్తాన్‌లో శాంతియుత ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. సమన్యాయపాలనను పాటించాలని సూచించారు. ఇంతకంటే ఎక్కువగా ఈ విషయంపై ప్రస్తుతం మాట్లాడలేమని చెప్పారు.

మరోవైపు ఐక్యరాజ్యసమితి కూడా ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై స్పందించింది. ఆయన అరెస్టు జరిగిన తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. పాక్ ప్రభుత్వం రాజకీయ నాయకులను సరిగ్గా ట్రీట్ చేయాలని సూచించింది. పరిస్థితులను నిశితంగా గమనిస్తామంది. తమ ఆందోళనలు పాక్ ప్రభుత్వం దృష్టికి వెళ్తాయని భావిస్తున్నట్లు తెలిపింది.