Beijing November 12: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తన అధికారాన్ని శాశ్వతం చేసుకున్నారు. జీవితాంతం తానే చైనా అధ్యక్షుడిగా ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు చారిత్రాత్మక తీర్మానానికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఆమోదం తెలిపింది. వందేళ్ల చరిత్రతో రూపొందించిన డ్యాక్యుమెంట్‌ను ప్లీనరీ ఆమోదించడంతో జిన్‌పింగ్ అధికారానికి ఢోకా లేకుండా పోయింది.
చైనా సాధించిన ఘన విజయాలు, భవిష్యత్తు లక్ష్యాలతో ఈ డాక్యుమెంట్‌ను తయారు చేశారు. కమ్యూనిస్టు పార్టీని స్థాపించిన తర్వాత చైనాలో ఇలాంటి డాక్యుమెంట్‌ను రూపొందించడం ఇది మూడవ సారి. గతంలో 1945లో మావో జిదాంగ్ తొలిసారి ఇలాంటి డాక్యుమెంట్‌కు ఆమోదం తెలిపారు. ఆ తర్వాత 1981లో డెంగ్ జియాపింగ్ రెండవ సారి ఘన చరిత్రకు సాక్ష్యంగా నిలిచారు. గురువారం జిన్‌పింగ్ అధ్యక్షతన జరిగిన ఆరవ ప్లీనరీ సెషన్‌లో కొత్త డాక్యుమెంట్‌కు గ్రీన్ సిగ్నల్ దక్కింది. దీంతో మావో, డెంగ్ సరసన జిన్‌పింగ్ నిలిచారు. కమ్యూనిస్టు దిగ్గజాలతో సమానంగా ఇప్పుడు జిన్‌పింగ్‌ను చైనీయులు చూడనున్నారు.
తాజా తీర్మానంతో గతంలో కొందరు చైనా నేతలు జారీ చేసిన అధికార వికేంద్రీకరణ ఆదేశాలను జిన్‌పింగ్ రద్దు చేశారు. 4 రోజుల పాటు జరిగిన ప్లీనరీలో దేశానికి చెందిన టాప్ నేతలంతా పాల్గొన్నారు. అయితే వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందు నిర్వహించిన భారీ మీటింగ్ ఇది. రాబోయే ఎన్నికల్లో మూడవ సారి దేశాధ్యక్ష పదవి కోసం జిన్‌పింగ్ పోటీపడనున్నారు.
దేశాధ్యక్ష పదవికి రెండు సార్లు మాత్రమే ఎన్నిక కావాలన్న నిబంధనను 2018లో చైనా రద్దు చేసింది. దీంతో జీవితకాలం జిన్‌పింగ్ అధ్యక్షుడయ్యేందుకు మార్గం సులువైంది. ఇవాళ ఆమోదం పొందిన తీర్మానంతో జిన్‌పింగ్ మరింత శక్తివంతంగా తయారైయ్యారు.
1945లో మావో తన తీర్మానంతో పూర్తి ఆధిపత్యాన్ని పొందారు. ఆ తర్వాత ఆ అధికారంతో ఆయన 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను క్రియేట్ చేశారు. ఇక 1978లో డెంగ్ తన తీర్మానం ద్వారా మావో తప్పులను ఎత్తిచూశారు. 1966 నుంచి 1976 వరకు జరిగిన సంస్కృతి విప్లవంలో లక్షలాది మంది మృతిచెందారని, దానికి మావో కారణమని డెంగ్ ఆరోపించారు. ఆ తర్వాత దేశంలో బలమైన ఆర్థిక సంస్కరణలకు డెంగ్ పునాది వేశారు. అయితే ఆ ఇద్దరికీ భిన్నంగా జిన్‌పింగ్ తన తీర్మానం ప్రతిపాదించారు. తాజా తీర్మానం ద్వారా తన అధికారాన్ని జిన్‌పింగ్ మరింత కాలం పొడిగించాలనుకున్నట్లు స్పష్టమవుతోంది.