New Delhi, January 16: ఈ ఏడాది భారతదేశంలో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సుకు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ను భారత్ ఆహ్వానించనుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య శత్రుత్వ వాతావరణం ఉన్నప్పటికీ పాకిస్థాన్‌కు ఆహ్వానం పంపాలనే భారత్ నిర్ణయించింది.
ఈ ఎస్‌సీఓ (Shanghai Cooperation Organisation) లో భారత్, పాకిస్థాన్ కలిపి మొత్తం 8 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. 2020కి గానూ జరుగుతున్న ఈ ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశానికి ఈ ఏడాది భారత్ (India) ఆతిథ్యం ఇస్తుంది. ఈ ఏడాది చివర్లో దిల్లీలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సభ్యత్వం కలిగిన మిగతా 7 దేశాధినేతలందరితో పాటు నలుగు దేశాల ప్రతినిధులను పరిశీలకులుగా, అంతార్జాతీయ ఉపన్యాసకర్తలుగా ఆహ్వానించాలని భారత్ నిర్ణయించింది.
పాకిస్థాన్‌కు ఆహ్వానాన్ని పంపే విషయాన్ని భారత విదేశాంగ శాఖ (MEA) ధృవీకరించింది. ఈ శిఖరాగ్ర సదస్సులో వివిధ దేశాల మధ్య బహుపాక్షిక సంబంధాలు మరియు ఆర్థికపరమైన, విధానపరమైన, వాణిజ్యపరమైన అంశాలపై ప్రధానమంత్రి స్థాయిలో చర్చ జరుగుతుంది. SCOలో ఉన్న మార్గదేశకాల ప్రకారం సభ్యత్వం కలిగి ఉన్న అన్ని దేశాలకు ఆహ్వానం పంపబడుతుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ స్పష్టం చేశారు.
SCO అనేది చైనా నేతృత్వంలో గల ఎనిమిది దేశాలు సభ్యులుగా గల ఆర్థిక మరియు భద్రత కూటమి. 2001లో ఈ కూటమి ఏర్పాటు కాగా, 2017లో భారతదేశం మరియు పాకిస్తాన్ దేశాలకు సభ్యత్వం లభించింది. ప్రస్తుతం ఈ కూటమిలో చైనా, రష్యా, కిర్గిజ్ రిపబ్లిక్, కజిఖస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్థాన్ మరియు భారత్ సభ్య దేశాలుగా ఉన్నాయి.
గతేడాది జూన్‌లో కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్‌కేక్‌లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరయ్యారు, ఆ సమయంలో ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, మద్ధతు ఇచ్చే దేశాలు ప్రపంచానికి జవాబుదారీగా ఉండాలని ప్రధాని మోదీ పాకిస్థాన్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.