Israel-Hamas Conflict: ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం (Israel-Hamas Conflict)తీవ్ర రూపం దాల్చుతోంది. తమ దేశంలో హమాస్ మిలిటెంట్లు సృష్టించిన మారణకాండకు ప్రతిగా గాజా (Gaza)పై విరుచుకుపడుతోన్న ఇజ్రాయెల్ సైన్యం (Israeli military).. రాబోయే రోజుల్లో వీటిని మరింత తీవ్రం చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఉత్తర గాజాలో ఉన్న 11 లక్షల మంది పాలస్తీనా పౌరులు 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని వీడాలని ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలపై ఐక్యరాజ్య సమితి (United Nations) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు దారుణమైన మానవతా సంక్షోభాన్ని సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఉత్తర గాజా (Gaza)లో హమాస్ ఉగ్రవాదులు టన్నెళ్లలో దాక్కొన్నారని, వారిని పట్టుకునేందుకే ఈ రీలొకేషన్ ఆదేశాలు జారీ చేశామని ఐడీఎఫ్ (IDF) వెల్లడించింది. ‘‘ఉత్తర గాజాలో ఉన్న పౌరులు తమ వ్యక్తిగత భద్రత కోసం తక్షణమే దక్షిణ ప్రాంతానికి తరలిపోవాలి. 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయండి. మిమ్మల్ని కవచాలుగా వాడుకోవాలని హమాస్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. వారి నుంచి దూరంగా వెళ్లండి. రాబోయే రాజుల్లో గాజా నగరంలోని హమాస్ నెట్‌వర్క్‌పై ఐడీఎఫ్ దాడులు పెంచనుంది. అమాయక పౌరులకు ఎలాటి నష్టం కలగకూడదని మేం కోరుకుంటున్నాం’’ అని ఐడీఎఫ్ తమ ప్రకటనలో వెల్లడించింది.
అటు, ఐరాసకు ఇజ్రాయెల్ ఈ సమాచారాన్ని అందించింది. అయితే, ఈ ఆదేశాలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ఇలా రీలొకేషన్ జరిగితే అత్యంత దారుణమైన మానవతా సంక్షోభం నెలకొంటుంది. గాజాలో స్కూళ్లు, క్లినిక్‌లు నడుపుతున్న ఐరాస కేంద్రాలు, సిబ్బంది కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోండి’’ అని ఐరాస సూచించింది.ఒకవేళ అలాంటి ఆదేశాలు చేస్తే వాటిని రద్దు చేయాలని యూఎన్ అభిప్రాయపడింది.
గాజాను గుప్పిట పట్టిన ఇజ్రాయెల్ సైన్యం .. అక్కడి ప్రజల విషయంలో అత్యంత కఠిన వైఖరిని అవలంభించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ సమాజం పిలుపు ఇచ్చినా సరే మానవతా దృక్ఫథంతో వ్యవహరించేది లేదని తేల్చేసింది. బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్ని హమాస్ విడుదల చేసేదాకా.. గాజా పౌరులకు కనీసం మంచి నీళ్లు కూడా అందవని స్పష్టం చేసింది.
మంచి నీరు, కరెంట్ కోతతో గాజా ప్రజలు అల్లలాడిపోతున్నారంటూ గాజా క్షేత్రస్థాయి పరిస్థితులపై కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో.. కనికరించి మానవతా సాయానికి ముందుకు రావాలంటూ రెడ్ క్రాస్ ఇజ్రాయెల్‌ను అభ్యర్థించింది. మరికొన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్‌ను ఇదే కోరాయి. అయితే ఈ పిలుపుపై ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
‘‘గాజాకు మానవతా సాయమా?.. ఎట్టి పరిస్థితుల్లో అది వీలు పడదు. బంధీలుగా ఉంచిన ఇజ్రాయెల్ పౌరులు సురక్షితంగా ఇంటికి చేరేంత వరకు గాజా ప్రజలకు కరెంట్, మంచి నీళ్లు.. మనుషులకే కాదు ఆఖరికి అక్కడి వాహనాలు కదిలేందుకు కావాల్సిన చమురు కూడా అందదు. మాకు ఎవరూ నీతులు బోధించకండి’’ అని స్పష్టం చేశారు.
శనివారం ఇజ్రాయెల్‌పై హమాస్ గ్రూప్ మెరుపుదాడి తర్వాత.. గాజా స్ట్రిప్‌లో మొత్తం 150 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని, విదేశీయుల్ని తమ బంధీలుగా ఉంచుకుంది. ఆ తర్వాత జరుగుతున్న పరస్పర దాడులతో భాగంగా.. గాజాను పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించుకుంది. ఇందుకు కోసం జరిపిన దాడుల్లో 1200 మందిని చంపింది. 5వేల మందిని గాయపర్చింది.
ఇక ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక పవర్ ప్లాంట్ ఇంధనం కొరత కారణంగా పని చేయడం ఆగిపోయింది. దీంతో ఆస్పత్రులకు సైతం కరెంట్ సరఫరా నిలిచిపోయి.. పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రెడ్‌క్రాస్ సానుకూలంగా స్పందించాలంటూ ఇజ్రాయెల్‌ను కోరుతోంది.
ఇదిలా ఉంటే గాజాలోని సొరంగాల నెట్‌వర్క్‌లో నక్కిన వారిని బయటకు తీసుకొచ్చి అంతం చేయడం ఇజ్రాయెల్ ముందున్న అతి పెద్ద సవాల్. మరోవైపు ఇజ్రాయెల్‌తోపాటు ఇతర దేశాలకు చెందిన పౌరులు హమాస్ వద్ద బందీలుగా ఉండటంతో వారి ప్రాణాలకు హాని కలగకుండా ఆపరేషన్ చేపట్టడం కత్తి మీద సాములాంటిదే. అయినప్పటికీ ఇజ్రాయెల్ సైన్యం గ్రౌండ్ ఆపరేషన్‌కు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.