New Delhi, Nov 5: ప్రపంచ వ్యాప్తంగా నీటి సంక్షోభం (Water Scarcity) రానుంది. ప్రపంచంలోని ప్రధాన నగరాలు అన్నీ నీరులేక విలవిల లాడనున్నాయి. ప్రపంచ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) (World Wildlife Fund (WWF) ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
ఈ సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన 100 ప్రధాన నగరాలు తీవ్రమైన నీటి సంక్షోభాన్నిఎదుర్కోనున్నాయి. దీంతో 2050 నాటికి ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న 350 మిలియన్ల ప్రజలు (350 million people) ఈ సమస్యను ఎదుర్కోనున్నారు.
వాతావరణ మార్పులకు అనుగుణంగా అత్యవసర చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఈ సర్వే పేర్కొంది. ఈ జాబితాలో 30 లక్షలకు పైగా జనాభా ఉన్న జైపూర్ 45వ స్థానంలో ఉండగా, 20 లక్షల జనాభాతో ఇండోర్ 75వ స్థానంలో ఉంది. దక్షిణ అమెరికా,దక్షిణ ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలతో పాటు చైనాలోని దాదాపు 50 నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ముఖ్యంగా భారత్‌లోని ప్రధాన నగరాలైన అమృత్‌సర్, పూణే, శ్రీనగర్, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, సూరత్ సహా కోజికోడ్, విశాఖపట్నం, థానే, వడోదర, రాజ్‌కోట్, కోటా, నాసిక్, లక్నో, కన్పూర్ సహా మరికొన్ని నగరాలు ఈ అత్యధిక రిస్క్ జోన్‌లో ఉన్నాయి.
దేశంలో పర్యావరణం తీవ్ర సంక్లిష్టంలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఉండగా మరికొన్ని నగరాల్లో వరదలు ప్రధాన సమస్యగా మరింది. వాటర్ షెడ్డులు, చిత్తడి నేలల పునరుద్ధణ వంటి చర్యలు వెంటనే చేపట్టకపోతే ఇది భవిష్యత్ తరాలకు తీవ్ర సమస్యగా మారే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. రిస్క్ జోన్‌లో ఉన్న నగరాలు 2020లో 17 శాతంగా ఉంటే ఇది 2050 నాటకి 51శాతానికి పెరగనున్నట్లు సర్వే పేర్కొంది