New York, March 13: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. న్యూయార్క్ లోని (New York) బ్రూక్లిన్ మెట్రో సబ్ వే (Brooklyn Subway) లో పేలుడు, కాల్పులు చోటు చేసుకున్నాయి. బిజీగా ఉన్న సమయంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 13 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గ్యాస్ మాస్క్ తో (Gas mask) మెట్రో సబ్ వే లోకి చొరబడిన దుండగుడు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో పేలుడు పదార్దాలను పోలీసులు గుర్తించారు. కాగా, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు వ్యక్తులు రక్తపు గాయాలతో ప్లాట్ ఫామ్ పై పడి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు బ్రూక్లిన్ లోని 36వ స్ట్రీట్ పరిసరాలను మూసివేశారు. పౌరులు ఎవరూ అటుగా వెళ్లొద్దని ఆదేశించారు. రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden).. దేశంలో తుపాకుల వినియోగంపై కొత్త నియంత్రణ చర్యలను ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ ఘటనను ఉగ్రదాడిగా పేర్కొంటున్నా.. అధికార వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. కాల్పులు జరిపిన దుండుగుడు నిర్మాణ రంగ కార్మికుడి దుస్తులు, గ్యాస్‌ మాస్క్‌ ధరించి ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందని వాపోతున్నారు.

Covid in China: చైనాలో కరోనా చావు కేకలు, లాక్‌డౌన్ బదులు మమ్మల్ని చంపేయండంటూ ప్రజలు ఆర్తనాదాలు, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

న్యూయార్క్‌ బ్రూక్లిన్‌ సబ్‌వేలో కాల్పుల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫ్రాంక్‌ ఆర్‌ జేమ్స్‌ (Frank R James) అనే 62 ఏండ్ల వ్యక్తి కాల్పులకు తెగబడినట్లు అనుమానిస్తున్నారు. ఈమేరకు అనుమానితుడి ఫొటోను న్యూయార్క్‌ పోలీస్‌ కమిషనర్ కీచాంట్‌ సెవెల్‌ విడుదల చేశారు. నిందితుడిని పట్టించినవారికి 50 వేల డాలర్లు ఇస్తామని ప్రకటించారు. కాల్పుల ఘటనలో 10 మంది గాయపడ్డారని, మరో 13 మందికి తొక్కిసలాటలో గాయాలయ్యాయని చెప్పారు. కాల్పులు జరుపడానికి ముందు నిందితుడు స్మోక్‌ పరికరంతో స్టేషన్‌లో పొగ కమ్ముకునేలా చేసి ఉంటాడని పోలీసులు తెలిపారు.