Imran On Foreign Media: కాసేపట్లో మోదీ-జిన్‌పింగ్‌ భేటీ,  వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ ప్రధాని, జమ్మూకాశ్మీర్ విషయంలో విదేశీ మీడియా సరిగా లేదంటూ విమర్శలు
Modi XI Jinping Meet:Pak-pm-imran-khan-equates-hong-kong-protests-kashmir (Photo-getty)

New delhi,October 11:  చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో అడుగుపెట్టిన నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ అంశంపై మీడియా కవరేజ్‌ సరిగా లేదని తప్పుపట్టారు. హాంకాంగ్‌ నిరసనలకు విశేష ప్రాచుర్యం కల్పిస్తున్న విదేశీ మీడియా కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలను విస్మరిస్తోందంటూ దుయ్యబట్టారు. హాంకాంగ్‌ నిరసనలను పతాక శీర్షికల్లో ప్రచురిస్తున్న అంతర్జాతీయ మీడియా జమ్ము కశ్మీర్‌లో యథేచ్ఛగా సాగుతున్న మానవ హక్కుల ఉ‍ల్లంఘనలను ఎలా విస్మరిస్తోందో అర్థం కావడం లేదంటూ ఇమ్రాన్‌ ట్వీట్‌ చేశారు.

అంతర్జాతీయ గుర్తింపు పొందిన వివాదాస్పద ప్రాంతాన్ని భారత్‌ తన దళాల గుప్పిట్లో పెట్టుకుని 80 లక్షల కశ్మీరీల గొంతు నొక్కుతోందని ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.

ఇమ్రాన్ ఖాన్ ట్వీట్

కాగా రెండు రోజుల భారత పర్యటనకు గాను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెన్నై చేరుకున్నారు. ఎయిర్ చైనా విమానంలో చెన్నెకు చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి తమిళనాడు సాంప్రదాయలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్ కు చేరుకోనున్నారు. అనంతరం ఇక్కడి నుంచి ఆయన మహాబలిపురం బయల్దేరుతారు. అక్కడ ప్రధాని మోడీ ఆయనకు స్వాగతం పలుకుతారు. కాగా ఆయన ప్రయాణించే మార్గమంతటా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మోడీ ట్విట్టర్ వేదికగా చైనా అధ్యక్షినికి ఘన స్వాగతం పలికారు.

చైనా భాషలో ప్రధాని మోడీ ట్వీట్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే చెన్నై సమీపంలోని పురాతన పట్టణం మహాబలిపురానికి చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి తమిళనాడు మంత్రి కె.పాండ్యరాజన్‌ సాదర స్వాగతం పలికారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సాయంత్రం 4 గంటలకు జరిగే భేటీ నిమిత్తం పీఎం మహాబలిపురానికి చేరుకున్నారు. గొప్ప ఆతిధ్య, సాంస్కృతిక నేపథ్యం గల తమిళనాడుకు రావడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోదీ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. మరోవైపు చైనా అధ్యక్షుడి పర్యటనకు వ్యతిరేకంగా టిబెటియన్‌లు ఆందోళన చేపట్టారు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఐదుగురు టిబెటియన్‌లను అదేవిధంగా ఐటీసీ గ్రాండ్‌ హోటల్‌ వద్ద ధర్నాకు దిగిన మరో 8 మంది టిబెటియన్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మహాబలిపురం చేరుకున్న మోడీ

కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే 370 ఆర్టికల్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో భారత్, పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనే చైనా అధ్యక్షుడి భారత్‌ రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనాకు సరిహద్దుగా ఉన్న లద్దాఖ్‌ను కశ్మీర్‌ 370 అధికరణం రద్దు చేయడం ద్వారా కేంద్ర పాలిత ప్రాంతం చేయడంతో ఈ అంశం ప్రముఖంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అరుణాచల్‌ ప్రదేశ్‌కు 100 కి.మీ. దూరంలో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌ నిర్వహిస్తున్న సైనిక కసరత్తులు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, ఆర్థిక సంబంధాలు, విదేశాంగ విధానాలు, చైనా 5జీ నెట్‌వర్క్‌ విధానం తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించుకునే అవకాశం ఉందని సమాచారం.