New Orleans, JAN 01: నూతన సంవత్సరం (New Year Eve) వేళ అమెరికాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. జనాలపైకి ఓ వాహనం దూసుకెళ్లిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 30 మందికి గాయాలైనట్లు సమాచారం. వేగంగా ఓ వాహనం (Car Accidents) దూసుకొచ్చిందని, అనంతరం డ్రైవర్ బయటకు వచ్చి జనాలపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోందని స్థానిక మీడియా వెల్లడించింది. లూసియానాలోని న్యూ ఆర్లీన్స్‌లో (New Orleans) ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
న్యూ ఆర్లీన్స్‌లో ఉన్న కెనాల్ అండ్ బోర్బన్ స్ట్రీట్ కూడలిలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. స్థానిక స్టేడియంలో (Superdome) ఇదే రోజు సాయంత్రం షుగర్ బౌల్ (Sugar Bowl) కాలేజీ ఫుట్‌బాల్ ప్లేఆఫ్ మ్యాచ్ జరగనుంది. దీంతో ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో జనాలు గుమికూడారు. అదే సమయంలో వేగంగా ఓ వాహనం దూసుకొచ్చింది. అందులో నుంచి బయటకు వచ్చిన డ్రైవర్.. సమూహంపై కాల్పులు జరిపాడు. అప్పటికే 10 మృతి చెందగా.. దాదాపు 30 మంది గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు..అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు హతమైనట్లు అధికారులు వెల్లడించారు.
ఈ దాడి ఉద్దేశపూర్వకంగా చేసినట్లు అనుమానిస్తున్నామని నగర పోలీసులు వెల్లడించారు. ఈ దుశ్చర్యను ఉగ్రదాడిగా నగర మేయర్ లాటోయా కాంట్రెల్ పేర్కొన్నారు. ఎఫ్‌బీఐ మాత్రం దీనిని తోసిపుచ్చింది. ఉగ్రదాడి కాదని అసిస్టెంట్ ఎఫ్‌బీఐ ఏజెంట్ ప్రకటించారు. అయితే, ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు గుర్తించామని, ఉగ్ర కోణంలోనూ దర్యాప్తు చేస్తామన్నారు.