Abiy Ahmed Ali-Facts: అబీ అహ్మద్‌కు నోబెల్ శాంతి బహుమతి, ఇండియా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన దేశం గురించి ఎంతమందికి తెలుసు?, ఇథియోపియా ప్రధాని గురించి కొన్ని ఆసక్తికర నిజాలు
nobel-peace-prize-2019-awarded-to-ethiopian-pm-abiy-ahmed-ali-quick-facts (Photo Credits: Nobel Academy)

Oslo,October 11:  ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ పీస్ ప్రైజ్ ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ ను వరించింది. ఎరిత్రియాలో శాంతిస్థాపనకు చేసిన కృషికిగాను అబీ అహ్మద్ 2019 నోబెల్ శాంతి బహుమతికి ఎన్నికయ్యారు. ఇథియోపియాకు, ఎరిత్రియాకు మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడంలో ఆయన చేసిన కృషికి గాను పురస్కారాన్ని అందిస్తున్నామని తెలిపింది. శాంతిని నెలకొల్పేందుకు, ఎరిత్రియాతో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు ఆయన తీసుకున్న చర్యలు చాలా ఘనమైనవని జ్యూరీ ప్రశంసించింది. సరిహద్దుకు సంబంధించి ఎరిత్రియా-ఇథియోపియాకు మధ్య 1998 నుంచి 2000 వరకు యుద్ధం జరిగింది. సంవత్సరాల తరబడి శత్రువులుగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య గత ఏడాది జూలైలో మళ్లీ స్నేహ సంబంధాలు చిగురించాయి.

ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడానికి అబీ చాలా కృషి చేశారు. నోబెల్ పురస్కారం కింద అబీ అహ్మద్ కు 9 లక్షల అమెరికా డాలర్ల నగదు బహుమతి అందుతుంది. స్వీడన్ లోని ఓస్లోలో డిసెంబర్ 10న స్వీడిష్ పారిశ్రామికవేత్త, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి నాడు ఓస్లోలో ప్రదానం చేస్తారు.

నోబెల్ పురస్కారం

ఇథియోపియా, ఎరిత్రియాల మధ్య 20 ఏళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించడంలో అబీ విశేషంగా కృషి చేశారు. యుద్ధంలో తీవ్ర రక్తపాతాన్ని, అపార ధన నష్టాన్ని ఈ రెండు దేశాలు చవిచూశాయి. 2018లో ఇథియోపియా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అబీ ఆ వెంటనే ఎరిత్రియా అధ్యక్షుడు అవెరికితో చర్చలు ప్రారంభించి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. గ‌తేడాది జూలై, సెప్టెంబ‌ర్ల‌లో జ‌రిగిన భేటీల్లో ఇరువురు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎటువంటి ష‌ర‌తులు లేకుండానే అంత‌ర్జాతీయ బౌండ‌రీ చ‌ట్టాల‌ను అమ‌లు చేసేందుకు అబే అంగీక‌రించారు.

ఈ సంధర్భంగా నోబెల్ క‌మిటీ అవార్డును ప్రకటిస్తూ.. ఒక‌రు ముందుకు వ‌స్తే శాంతి నెల‌కొన‌ద‌ని, ఇరువురు కలిస్తేనే అది సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్య‌క్తం చేసింది. అబే ఇచ్చిన స్నేహ హ‌స్తాన్ని ఎరిత్రియా అధ్య‌క్షుడు స్వీకరించడం ద్వారా ఇథియోపియా, ఎరిత్రియా దేశ ప్ర‌జ‌ల్లో మార్పులను తీసుకువస్తుందని క‌మిటీ పేర్కొంది.

అవార్డుల అనౌన్స్ 

ఏప్రిల్ 2018లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇథియోపియాలో పెనుమార్పులు తీసుకురావడంలో ప్రధాని అబి అహ్మద్ కీలకంగా వ్యవహరించారు. తాను తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు చాలామందిని ఆకట్టుకున్నాయి. దేశ రూపురేఖలను మార్చేశాయి. తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆరునెలల్లోనే ఎరిత్రియాతో శాంతి చర్చలు జరిపి విజయం సాధించారు. జైలులో మగ్గుతున్న ఇట్రియాకు చెందిన వారిని విడుదల చేయించారు. తమ దేశం చేసిన దానికి క్షమాపణలు చెప్పారు. వచ్చే ఏడాది మేలో జరగనున్న ఎన్నికలకు అబి అహ్మద్ సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఇథియోపియా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే వాటిని అమలు చేయడం కష్టమే అయినప్పటికీ, ఇథియోపియాకు ఏదో చేయాలన్న కసి తనను తిరిగి ప్రధానిని చేస్తుందని తన శ్రేయోభిలాషులు, సన్నిహితులు చెబుతున్నారు.

అబి అహ్మద్ తండ్రి ముస్లిం కాగా తల్లి క్రైస్తవరాలు. అబి అహ్మద్ బెషాషా పట్టణంలో పుట్టాడు. అబి అహ్మద్ చిన్నతనంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. వారు నివాసమున్న ఇంట్లో విద్యుత్ ఉండేది కాదు. నీటి సరఫరా ఉండేది కాదు. ఎక్కడో నదికి వెళ్లి నీళ్లు తీసుకొచ్చుకునేవారని ఓ రేడియో ఇంటర్వ్యూలో చెప్పారు. టీనేజర్‌గా ఉన్న సమయంలో టెక్నాలజీపై మక్కువతో మిలటరీలో రేడియో ఆపరేటర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రభుత్వంలోకి రాకముందు అబి అహ్మద్ మిలటరీలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు.ఇథియోపియా సైబర్ సైయింగ్‌ శాఖకు అబి అహ్మద్ వ్యవస్థాపకుడుగా ఉన్నారు.

కాగా ఇథియోపియా మొక్కలను నాటడంలో ప్రపంచ రికార్డు సాధించింది. జూలై 29వ తేదీన ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ ఆ దేశ వ్యాప్తంగా 12 గంటల్లో 200 మిలియన్ల మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటే రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. అలా వారు 12 గంటల్లోనే అనుకున్నదానికన్నా ఎక్కువగానే మొక్కలు నాటారు. మొత్తం 350 మిలియన్ల మొక్కలను నాటినట్లు ఇథియోపియా ఐటీ మంత్రి డాక్టర్ గెతాహున్ మెకురియా తెలిపారు.

మొక్కలు నాటుతున్న ఇథియోపియా ప్రధాని

దీంతో తక్కువ సమయంలోనే అత్యధిక మొక్కలు నాటిన దేశంగా ఇథియోపియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2016లో ఒక రోజులో దేశ వ్యాప్తంగా 50 మిలియన్ల మొక్కలు నాటిన ఇండియా రికార్డును ఇథియోపియా తిరగరాసింది.