Cancer (Credits: X)

మనలో చాలామంది క్యాన్సర్ అనేది కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే వస్తుందని భావిస్తారు. కానీ వైద్య పరిశోధనలు చెప్పే దాని ప్రకారం కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర లేకపోయినా, జీవనశైలి, వయస్సు, ఆహారపు అలవాట్లు, పర్యావరణ ప్రభావాలు వంటి అంశాలు భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి వ్యాధి వచ్చిన తర్వాత పోరాడటానికి కాకుండా, ఆ వ్యాధి రాకుండా నిరోధించడమే అసలైన రక్షణ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

యుకే రేడియేషన్ ఆంకాలజిస్టు డాక్టర్ జిరి కుబ్స్ ప్రకారం, పురుషులు సాధారణంగా తమ ఆరోగ్యంలో కనిపించే చిన్న మార్పులను పట్టించుకోరు.వయస్సు పెరుగుతోంది కాబట్టి నొప్పులు సహజం, లేదా అలసట పనిబారంతో వస్తుంది అనే అభిప్రాయం వల్ల చాలా మంది ప్రారంభ దశ క్యాన్సర్‌ను గుర్తించకుండా వదిలేస్తారు. అయితే ఈ నిర్లక్ష్యం కొన్నిసార్లు ప్రమాదకరమవుతుంది.

తరచుగా లేదా నిరంతరం వెన్నునొప్పి ఉండటం వయస్సు లేదా కండరాల బలహీనత కారణమని అనుకోవచ్చు. కానీ నొప్పి ఎక్కువకాలం కొనసాగితే, రాత్రి వేళల్లో తీవ్రత పెరిగితే, సాధారణ చికిత్సతో ఉపశమనం రాకపోతే అది ఎముకల లేదా వెన్నుపూస క్యాన్సర్ సంకేతం కావచ్చు. అలాంటి సందర్భాల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. క్యాన్సర్ కణజాలాలు సాధారణ కణజాలాల కంటే ఎక్కువ శక్తి అవసరం చేసుకుంటాయి. దీని ఫలితంగా శరీరంలోని కొవ్వు, కండరాలు వేగంగా కరిగిపోతాయి. ఎటువంటి వ్యాయామం లేదా డైట్ మార్పు లేకపోయినా బరువు తగ్గితే, అది జీర్ణాశయం, కాలేయం లేదా అగ్న్యాశయ క్యాన్సర్ సంకేతం కావచ్చు.

భారత్‌లో భారీగా పెరుగుతున్న అంటువ్యాధులు, ఐసీఎంఆర్‌ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి.. అలర్ట్ కాకుండా అంతే సంగతులిక..

తగిన విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసట, బలహీనత తగ్గకపోతే, రక్తహీనత లేదా లుకేమియా వంటి రక్త క్యాన్సర్‌కి సూచన కావచ్చు. సాధారణ జలుబు లేదా దగ్గు అని భావించి నిర్లక్ష్యం చేసే గొంతు నొప్పి మూడు వారాలకంటే ఎక్కువ కొనసాగితే, ముఖ్యంగా మింగడంలో ఇబ్బంది లేదా చెవి నొప్పితో కలిపి ఉంటే — అది గొంతు క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. మూత్రంలో రక్తం, నిరంతర మూత్ర విసర్జన, లేదా మల విసర్జనలో మార్పులు ప్రోస్టేట్ లేదా కోలన్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలుగా పరిగణించబడతాయి. ఏదైనా భాగంలో గడ్డలాంటి దృఢమైన వాపు, లేదా పెరుగుతూ ఉన్న ముద్దలు కనిపిస్తే — అవి క్యాన్సర్ ప్రారంభ దశల సూచన కావచ్చు. తరచూ దగ్గు రావడం, లేదా శ్వాసలో ఇబ్బంది అనిపించడం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సూచన కావచ్చు, ముఖ్యంగా పొగతాగే వారికి.

డాక్టర్ కుబ్స్ చెబుతున్నట్లు శరీరం ఎప్పుడూ సంకేతాలను ఇస్తుంది. వాటిని గుర్తించడం మన బాధ్యత. ఏదైనా లక్షణం మూడువారాల కంటే ఎక్కువకాలం కొనసాగితే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది, ప్రాణాలను కాపాడుకోవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి