Peshawar, Jan 30: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో సోమవారం ఆత్మాహుతి దాడి ఘటనలో (Pakistan Mosque Blast) మృతుల సంఖ్య అంతకంతకే పెరుగుతున్నది. ఇవాళ మధ్యాహ్నం దాడి జరగగా సాయంత్రానికి మృతుల సంఖ్య 32కు చేరింది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలోగల హై సెక్యూరిటీ జోన్ గల పోలీస్ లైన్స్ ప్రాంతంలోని ఓ మసీదులో ఈ ఆత్మాహుతి దాడి (Peshawar mosque suicide blast) జరిగింది.
మసీదులో మధ్యాహ్నం 1.45 గంటలకు జుహర్ ప్రార్థనల సమయంలో ఒక్కసారిగా భారీగా పేలుడు శబ్దం రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అధికారిక సమాచారం ప్రకారం.. 32 మంది మృతి చెందగా మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మరో 100 మందికి తీవ్ర గాయాలవ్వగా.. క్షతగాత్రులను పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పేలుడు దాటికి మసీదు పైకప్పు, ఓ వైపు గోడ భాగం కూలిపోయింది. భవన శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మసీదులో ఓ వ్యక్తి తనతంట తాను పేల్చుకున్నట్లు.. తొలి వరుసలో ఉన్న వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. కేవలం అంబులెన్స్‌లను మాత్రమే అనుమతిస్తున్నారు.
ఇదిలా ఉంటే మసీదులో బాంబు పేలుడు ఘటనకు బాధ్యత తమదేనంటూ తెహ్రిక్- ఐ- తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ప్రకటించుకుంది.ఈ ఘటనపై పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ అధికారి మహ్మద్ ఇజాజ్ ఖాన్ మాట్లాడుతూ.. పేలుడు తర్వాత మసీదు పైకప్పు కూలిపోయిందన్నారు.
ఈ శిథిలాల కింద చాలా మంది జవాన్లు చిక్కుకుపోగా వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. 250 నుంచి 300 మంది పట్టే ప్రధాన హాలులో పైకప్పు కూలిపోయిందని.. మిగతా భవనం చెక్కు చెదరలేదన్నారు. దాదాపు 300 నుంచి 400 మంది పోలీసు సిబ్బంది పేలుడు జరిగిన ఘటనలో అక్కడ ఉన్నారని.. భద్రతా లోపం స్పష్టంగా కనబడుతోందని చెప్పారు.
ఈ ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లాతో కలిసి పెషావర్‌కు చేరుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి రక్తాన్నిదానం చేసేందుకు పీఎంఎల్-ఎన్ కార్యకర్తలు ముందుకు రావాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఎల్‌ఆర్‌హెచ్ ఆస్పత్రి వద్దకు త్వరగా వచ్చి విలువైన ప్రాణాలు కాపాడటంతో కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్టు మంత్రి రాణా సనావుల్లా తెలిపారు.
ఈ ఘటనలో మృతదేహాలతో పాటు క్షతగాత్రులను ఎల్‌ఆర్‌హెచ్ ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో రోడ్లను మూసివేసిన అధికారులు రెడ్‌జోన్ ప్రకటించారు. ఈ ఘటనపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి నిఘాను మెరుగుపరచాలని సూచించారు.
గతేడాది కూడా పెషావర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కొచా రిసల్దార్ ప్రాంతంలోని షియా మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 63మంది ప్రాణాలు కోల్పోయారు.