Lahore, Feb 14: పాకిస్థాన్‌లో గతవారం జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాక హంగ్ ఏర్పడే దిశగా రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో దాయాది దేశంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ, బిలావల్ భుట్టో-జర్దారీ సారథ్యంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. ఈ కలయిక అనంతరం తన సోదరుడు షేబాజ్ షరీఫ్‌ను (Nawaz Nominates Brother Shehbaz for PM) నవాజ్ షరీఫ్ ప్రధాని అభ్యర్థిగా (Pakistan New PM) సూచించారు.ఇక కూతురు మర్యంను పంజాబ్ సీఎంగా ప్రకటించారు.
పాక్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్, సంచలన ఆరోపణలు చేసిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ
ఈ పరిస్థితులు ఇలా ఉంటే.. పాక్ మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పవర్ షేరింగ్ ఒప్పందాన్ని ఖండించింది. తమదే అసలైన ప్రజా గొంతుక అని పునరుద్ఘాటించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పీపీపీ 53 స్థానాలు గెలుచుకోగా, పీఎంఎల్-ఎన్ 75 స్థానాలు గెలుచుకుంది. ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పీటీఐ గుర్తును ఈసీ రద్దు చేయడంతో ఆ పార్టీ నేతలంతా స్వతంత్రంగా బరిలోకి దిగి 101 స్థానాల్లో గెలుపొందారు. వీరంతా స్వతంత్రులుగా నెగ్గడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకుండా పోయింది.
265 సీట్లు కలిగిన పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 133 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి కూడా మెజార్టీ మార్కు దక్కకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు అయోమయంలో పడింది. దీంతో నవాజ్ పార్టీ, పీపీపీ చేతులు కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. ఇక ఈ ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలుపొందిన ముత్తాహిదా క్వామి మూవ్‌మెంట్-;పాకిస్థాన్ (ఎంక్యూఎం-పీ) కూడా షేబాజ్ షరీఫ్‌కు మద్దతు ప్రకటించింది.