Image used for representational purpose | (Photo Credits: PTI)

భారత ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ అంతర్జాతీయ కోర్టును (ICJ -International Court of Justice) ఆశ్రయించాలని పాకిస్థాన్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ కేబినేట్ కూడా ఆమోదించింది. పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీ మంగళవారం రోజున వారి మీడియాతో నిర్వహించిన ఒక సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. న్యాయపరమైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బాగా ఆలోచించిన తర్వాతే పాకిస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

'జమ్మూ కాశ్మీర్ లో భారత ప్రభుత్వం మారణ హోమం సృష్టిస్తుంది, మానవ హక్కుల ఉల్లంఘన చేస్తుంది.' అనే దానిని హైలైట్ చేస్తూ పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ కోర్టులో పిటిషన్ వేయనుంది.

UNSCలో చెల్లని రూపాయి ఇంటర్నేషనల్ కోర్టులో చెల్లుతుందా?

కాశ్మీర్ విషయంలో అతిగా స్పందిస్తున్న పాకిస్థాన్ ప్రతీసారి బొక్కాబోర్లా పడుతూనే ఉంది. ఐక్యరాజ్య సమితి కల్పించుకోవాలి, ప్రపంచ దేశాలూ భారత్ ను నిలదీయాలి అంటూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎంత అరిచినా, ఏ ఒక్కరు పట్టించుకోలేదు. దీంతో చైనా కాళ్ళవేళ్లా పడి బలవంతంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలితో కాశ్మీర్ అంశంపై చర్చించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా అనధికార సమావేశమే. ఆ సమావేశంలో పాల్గొన్న సభ్యదేశాలన్నీ 'మీరూ మీరూ చూసుకోండి, ఐరాసను ఇన్వాల్వ్ చేయకండి' అని తెగేసి చెప్పాయి. కనీసం ఆ సమావేశానంతరం ఏ ఒక్క దేశ సభ్యుడు కూడా మీడియాతో కూడా మాట్లాడలేకపోయారు. అంత గొప్ప సమావేశం అది.

దీంతో చేసేదేం లేక పాకిస్థాన్, చైనా ప్రతినిధులే ఇది ఇరు దేశాలు చర్చించుకోవాల్సిన అంశం అని ప్రకటించేసుకున్నారు. దీనికే అదెదో పెద్ద ఘనత సాధించినట్లు, విజయం మాదే అంటూ పాకిస్థాన్ ప్రభుత్వం, వారి మీడియా ఎవరికీ ఉపయోగం లేని ప్రచారం చేసుకుంది. తప్పుడు వార్తలతో వారి దేశ ప్రజలనే తప్పుదోవ పట్టించారు.

మళ్ళీ ఇప్పుడు చివరాఖరి అస్త్రంగా అంతర్జాతీయ కోర్టుకు వెళ్లాలనుకుంటున్నారు. ఈ అంతర్జాతీయ కోర్టు కూడా ఐక్యరాజ్య సంస్థ అనుబంధంగా పనిచేసేదే. అంతర్జాతీయ వివాదాలు ఏమైనా ఉంటే వీటిని పరిష్కరించే దిశగా ఆయా దేశాలకు ఐరాస సూచనలు ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తుంది. అంటే మళ్ళీ ఐక్యరాజ్య సమితికే చేరుతుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలే ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇటు భారత్ కూడా ఇది తమ అంతర్గత వ్యవహారం ఏ దేశం కూడా ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. తాము ఎవరిని లేక్క చేయం అంటూ ఇప్పటికే తెగేసి చెప్పింది.  అయినా పాకిస్థాన్ మాత్రం మొండిగా ముందుకెళ్తుంది. తన వాదనలో పసలేదని తెలిసినా ,  మారణ హోమం, హక్కుల ఉల్లంఘన అనే నిరాధార ఆరోపణలతో కేసు వేయాలని డిసైడ్ అయింది. అయితే ఎన్నిసార్లు పరువు పోయినా పాకిస్థాన్ దులిపేసుకుంటుంది కాబట్టి మరోసారి తన అదృష్టాన్ని, తన శీలాన్ని అంతర్జాతీయ కోర్టులో పరీక్షించుకోనుంది